జమ్మలమడుగు : గండికోటలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసును పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని సీఐ నరేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది జూలైలో జరిగిన ఈ హత్యకు సంబంధించి అనుమానం ఉన్న నిందితులు, అనుమానం ఉన్న వారిని సైతం విచారణ చేపట్టామని తెలిపారు. పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించామని అందులో కూడా ఏమి తేలకపోవడంతో.. అనుమానం ఉన్న వారిని గుర్తించి నార్కో అనాలసిస్ పరీక్షల కోసం ఇటీవల రాజస్తాన్‌కు తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలు మరో 20 రోజుల్లో వస్తాయన్నారు. వీలైనంత త్వరలో ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితులకు పట్టుకుని అరెస్టు చేయడం జరుగుతుందని వివరించారు.
ప్రైవేట్ క్లినిక్ సీజ్
చాపాడు : మండల పరిధిలోని నరహరిపురం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ప్రైవేట్ క్లినిక్‌ను వైద్యాధికారి డాక్టర్ ఓబులేసు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మల్లేష్ ఆదేశాల మేరకు క్లినిక్‌లో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ క్లినిక్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ క్లినిక్‌ను కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య, హెల్త్ సూపర్‌వైజర్ ప్రసాద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
వల్లూరు : కడప నుంచి వల్లూరుకు వెళ్లే దారిలో మండల పరిధిలోని సత్యా గ్రీన్ సిటీలో మంగళవారం 3 టన్నుల బరువు గల సుమారు రూ.ఒక లక్ష విలువ చేసే 65 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అఽధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు కడప విజిలెన్స్ అధికారులు, కడప సీఎస్ డీటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. చెన్నూరుకు చెందిన నిరంజన్ అనే వ్యక్తి చెన్నూరు, చుట్టు పక్కల గ్రామాల నుంచి బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, నిల్వ ఉంచి కడపకు చెందిన శేఖర్‌రెడ్డికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు 3 టన్నుల బరువు గల సుమారు రూ 1,00,000 విలువ చేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి కడప సీఎస్ డీటీ మనోజ్‌కు అప్పగించారు. నిరంజన్‌పై 6(ఏ) కేసు నమోదు చేసి చెన్నూరు పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌లు ఎమ్ శివన్న, పీ శ్రీనివాసరెడ్డి, కడప సీఎస్ డీటీ పీఎండీ మనోజ్, సిబ్బంది పాల్గొన్నారు.


