పెట్రోలు పోసి కాల్చిన ఘటనలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

పెట్రోలు పోసి కాల్చిన ఘటనలో యువకుడి మృతి

Mar 4 2026 7:39 AM | Updated on Mar 4 2026 7:39 AM

కాశినాయన : పెట్రోలు పోసి కాల్చిన ఘటనలో.. గాయపడిన ఓ యువకుడి మృతి చెందాడు. నిందితులను అరెస్ట్‌ చేయాలని మృతుడి బంధువులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. చివరికి వారు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. అయినా పోలీసులు నిందితులను పట్టుకోలేదు. ఇందుకు కారణం అధికార పార్టీ వారు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాశినాయన మండలంలోని గంగనపల్లె గ్రామానికి చెందిన కందుల దిలీప్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పు అంటించడంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 1న(ఆదివారం) చనిపోయాడు. దిలీప్‌ కొరియర్‌ బాయ్‌గా పని చేస్తుండే వాడు. కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లెకు చెందిన ఓ యువకుడితో దిలీప్‌కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాయునిపల్లె గ్రామానికి చెందిన ఓ యువతితో పుల్లారెడ్డిపల్లెకు చెందిన యువకుడు ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. అయితే దిలీప్‌ కూడా ఆ అమ్మాయి పట్ల ప్రేమలో పడ్డట్లు ఆ యువకుడు అనుమానించాడు. ఈ క్రమంలోనే పుల్లారెడ్డిపల్లె యువకుడు బండిలో పెట్రోలు అయిపోయింది పెట్రోలు తీసుకురావాలని దిలీప్‌కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. దీంతో పెట్రోలు తెచ్చిన దిలీప్‌పై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని పోరుమామిమళ్ల ప్రబుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. సోమవారం రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి దిలీప్‌ మృతదేశాన్ని బంధువులకు అప్పగించారు. వారు మృతదేహాన్ని తీసుకొచ్చి సోమవారం రాత్రి పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఉంచి ఆందోళన చేశారు. దిలీప్‌పై దాడి చేసి 10 రోజులు అవుతున్నా ఇంత వరకు నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాశినాయన ఎస్‌ఐ యోగేంద్రను వివరణ కోరగా అనుమానితులను గుర్తించామని, వారిని విచారణ చేస్తున్నామని, త్వరలో అసలు నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

నిందితులకు అండగా నిలిచిన టీడీపీ

కేసు దర్యాప్తులో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న పోలీసులు

మృతుడి బంధువుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement