మైదుకూరు : మైదుకూరులో మంగళవారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు దాడులు చేసి.. ఓ వాటర్ ప్లాంట్‌లో అక్రమంగా నిల్వ చేసిన రూ.2.20 లక్షల విలువైన రేషన్ బియ్యం, జొన్నలు, రాగులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని నంద్యాల రోడ్డులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి రవాణాకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందడంతో కడప రీజనల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరీముల్లా ఆదేశాల మేరకు బద్వేలు పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్ ఆధ్వర్యంలో కడప విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నంద్యాల రోడ్డులోని శ్రీవెంకటశ్వర వాటర్ ప్లాంట్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 57 బస్తాల్లోని రూ.35,625 విలువైన 1425 కిలోల రేషన్ బియ్యం, 91 బస్తాల్లోని రూ.1,72,900 విలువైన 4550 కిలోల జొన్నలు, ఆరు బస్తాల్లోని రూ.12,420 విలువైన 270 కిలోల రాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ మైదుకూరుకు చెందిన శీలం సురేంద్ర అనే వ్యక్తి మైదుకూరు, బి.మఠం చుట్టు పక్కల గ్రామాల నుంచి రేషన్ బియ్యం, జొన్నలు, రాగులను తక్కువ ధరకు సేకరిస్తున్నట్టు తమ విచారణలో తెలిసిందన్నారు. వీటిని నిల్వ ఉంచి పసల పవన్‌కళ్యాణ్, ఎం.వంశీ అనే వ్యక్తుల ద్వారా బొలెరో వాహనం, ఆటోలో శ్రీసుబ్బరాయ రైస్ మిల్ యజమాని ప్రసాద్ అనే వ్యక్తికి అధిక ధరలకు అమ్ముతున్నట్టు తెలిసిందన్నారు. పట్టుబడిన రేషన్ బియ్యం, జొన్నలు, రాగులను, బొలెరో వాహనం, ఆటోను సీజ్ చేసి బద్వేలు పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించినట్టు తెలిపారు. శీలం సురేంద్ర, పసల పవన్‌కళ్యాణ్, ఎం.వంశీ, ప్రసాద్‌లపై 6(ఏ) కేసు నమోదు చేసినట్టు వివరించారు. దాడుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ జి.లక్ష్మణకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.2.20 లక్షల రేషన్ బియ్యం,
జొన్నలు, రాగులు స్వాధీనం


