కడప రూరల్ : జిల్లా బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గిరిజన భవన్‌లో ఘనంగా బంజారా హోలీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో బంజారా ఉద్యోగులు, వ్యాపారస్తులు, ముఖ్యంగా బంజారా యువతి యువకులు పాల్గొని మొదటగా బంజారా సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో హోలీని నిర్వహించుకున్నారు. రంగులు చల్లుకొని, విందు భోజనాలతో సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది బంజారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదే విధంగా వివిధ హోదాలో వచ్చిన ముఖ్య నాయకులను సన్మానించారు. హోలీ నిర్వహణ కమిటీ సభ్యులు డాక్టర్ శివా నాయక్ మాట్లాడుతూ దేశంలోనే పెద్ద పండుగ హోలీ అని, అటువంటి హోలీ పండుగను గత 13 సంవత్సరాల నుంచి ఇలా జరుపుకొంటున్నట్లు తెలిపారు. కమిటీ తరఫున ప్రత్యేక హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట రమణ నాయక్, కడప డిప్యూటీ మేయర్ నిత్యనందరెడ్డి, హోలీ నిర్వాహకులు వెంకటస్వామి నాయక్, మూడే శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, వేణుగోపాల్ నాయక్, రామూర్తి నాయక్, అర్జున్ నాయక్, కృష్ణ నాయక్, రామ్లా నాయక్, మహిళలు సావిత్రి భాయ్, సోని భాయ్, సరోజ భాయ్ తదితరులు పాల్గొన్నారు.


