ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న శ్రీరామనవమి పర్వదిన ధ్వజారోహణంతో ప్రారంభయ్యే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామస్వామి వారి ఆలయంలో, కళ్యాణ వేదికల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ..గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొనిఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. కల్యాణం రోజున భక్తుల రవాణా, వసతి, పార్కింగ్ కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సివిల్ విభాగం ఎస్‌ఈ మనోహర్, డిప్యూటీ ఈవో శివప్రసాద్, వీజీవో గిరిధర్, ఎలక్ట్రికల్ డీఈ రవిశంకర్, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి నరసింహాచారి, ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, సివిల్ విభాగం ఈఈ సుమతి, డీఈ నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.


