వల్లూరు : పుష్పగిరి వద్ద పెన్నా నది నీటిలో ఆదివారం గల్లంతైన ఎంబీఏ విద్యార్థుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. కడప పట్టణానికి చెందిన చైతన్య (25), కొండాపురం మండలం గండ్లూరు గ్రామానికి చెందిన శ్రీనాథ్(23), శ్రీనాథ్ సమీప బంధువు, కడప పట్టణంలో ముత్తూట్ ఫైనాన్స్‌లో పని చేస్తున్న కొండాపురం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన సురేంద్రతో కలసి ఆదివారం సరదాగా గడపడానికి వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి వద్దకు వచ్చి పెన్నా నదిలో ఈత ఆడే క్రమంలో సురేంద్ర సురక్షితంగా బయట పడగా, శ్రీనాథ్, చైతన్యలు గల్లంతైన విషయం విదితమే. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివ నాగిరెడ్డి సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో ట్యూ బుల ద్వారా గల్లంతైన వారి ఆచూకీ కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం కనిపించలేదు. కాగా సోమవారం ఎస్సై ఆధ్వర్యంలో కమలాపురం ఫైర్ సిబ్బంది రబ్బర్ బోటు సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొదట చైతన్య మృతదేహం, తర్వాత శ్రీనాథ్ మృతదేహం లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసి వారి తల్లిదండ్రులు, బంధువులు రోదించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివ నాగిరెడ్డి తెలిపారు.


