బస్సు, బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
సిద్దవటం : సిద్దవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్ పోస్టు సమీపాన ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో కోర్టు ఉద్యోగి దుర్మరణం చెందాడు. సిద్దవటం కోర్టులో లోక్ అదాలత్ సెక్షన్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బత్తల మధుసూదన్‌రావు(47) ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంలో బద్వేల్ నుంచి రాజంపేటకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని బద్వేల్ వైపు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా కారును తప్పించబోయి బద్వేల్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ హయ్యర్ బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలానికి ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ హారిక, ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర, స్థానిక పోలీసులు చేరుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.
నడుచుకుంటూ వెళ్తుండగా..
మైదుకూరు : మండలంలోని జీవీ సత్రం–గంగాయపల్లె రహదారిలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని కూనపులి గురవయ్య (62) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జీవీ సత్రం వద్ద ఉన్న శ్రీరామ్‌నగర్‌కు చెందిన గురవయ్య మేసీ్త్రగా పని చేస్తుంటాడు. ఆదివారం తన గ్రామానికి సమీపంలో ఉన్న లక్ష్మీనారాయణపురంలో కొత్తగా కట్టిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి గ్రామానికి నడుచుకుంటూ వస్తుండగా జ్యోతి నగర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సంఘటనలో గురవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించి మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాయితో భార్య తలపై కొట్టిన భర్త
ఎర్రగుంట్ల : మద్యం మత్తులో కోపంతో భార్య తలపై భర్త రాయితో కొట్టిన సంఘటన ఆదివారం ఎర్రగుంట్లలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరు గ్రామానికి చెందిన జ్యోతి, చంటి అనే భార్యాభర్తలు కుటుంబ కలహాల వల్ల వేర్వేరుగా ఉన్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆదివారం చంటి కుమార్తెను చూడడానికి వెళ్లాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తర్వాత ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న జ్యోతిని చంటి రాయితో తలపై గట్టిగా కొట్టాడు. రక్త గాయంతో జ్యోతి ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వెంటనే సీఐ విశ్వనాథరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ రాజారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ ఆల్‌ఫ్రేడ్‌తోపాటు మరి కొందరు పోలీసులు ఆటోలో చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


