ప్రాణం తీసిన ఈత సరదా
– పీబీసీ కాలువలో యువకుడి మృతి
పులివెందుల రూరల్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామానికి చెందిన నాగరాజ్ కుమారుడు మహేంద్ర తన స్నేహితులతో కలిసి నల్లపురెడ్డిపల్లె రోడ్డుకు వెళ్లే దారి సమీపంలో ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ దగ్గరకు ఈతకు వెళ్లారు. పీబీసీ కాలువలో ఈత కొడుతుండగా మహేంద్ర మునిగిపోయాడు. తన స్నేహితులు కూడా కాలువలో ఉండగా సుజుకి షోరూంకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ ప్రాంతంలో వెళుతుండగా కాలువలో పడి ఉన్న ఇద్దరు యువకులను బయటికి తీశారు. మరో వ్యక్తి కనిపించకపోవడంతో స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలో ఉన్న మహేంద్ర మృతదేహాన్ని వెలికి తీశారు. చిన్న వయస్సులో మహేంద్ర మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
పందిని తప్పించబోయి.. డ్రైవరు దుర్మరణం
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయ రహదారిపై రాజంపేట మండలంలోని బోయనపల్లె–నందలూరు మధ్య ఉన్న పాత బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కా ర్యాలయం సమీపంలో అడ్డుగా వచ్చిన పందిని తప్పించబోయి ఆటో డ్రైవరు వెలగచర్ల నాగేంద్రబాబు (26) శుక్రవారం దుర్మరణం చెందాడు. తన తల్లిని రాజంపేటలో బస్సు ఎక్కించి తిరుగు ప్రయాణంలో రేణింతలకు ఆటో నడుపుకొంటూ వెళుతున్న క్రమంలో.. పందిని తప్పించేందుకు ఆటో తిప్పుతుండగా కంటైనర్ ఢీకొంది. నాగేంద్ర బాబుపై కంటైనర్ వెనుక చక్రాల టైర్ ఎక్కడంతో తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని మన్నూరు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మృతుడు రేణింతల బాదనగడ్డ అరుంధతివాడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ను డ్రైవర్ నిలపకుండా తప్పించుకొని పోయాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఎర్రచందనం కేసులో ఒకరికి ఏడాది జైలు
తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బాలినేని గంగయ్యకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి ఎస్.శ్రీకాంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి వెంకటేశ్వర్లు కథనం మేరకు.. ప్రొద్దుటూరు డివిజన్, పాతూరు బీట్, నగేష్ కోన అటవీ ప్రాంతంలో కడప ఫ్లయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు చేశారు. ఆ సమయంలో గంగయ్య వద్ద 1,280 కిలోల 52 ఎర్రచందనం దుంగలు ఉండగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఫారెస్ట్ సిబ్బంది అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో, శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ప్రొద్దుటూరు క్రైం : మైదుకూరులోని అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసులు శుక్రవారం ప్రొద్దుటూరులో క్రిమిసంహారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోరుమామిళ్ల మండలంలోని రామేశ్వరం అతని స్వగ్రామం. గ్రామంలో కొంత కాలం నుంచి అన్నదమ్ముల మధ్య భూ వివాదం నడుస్తోంది. అనేక మార్లు విన్నవించినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదని శ్రీనివాసులు తెలిపాడు. తనకు న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతను ప్రొద్దుటూరులోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.
ప్రాణం తీసిన ఈత సరదా


