నామమాత్రంగా రోడ్డు నిర్మాణ సమావేశం
పులివెందుల టౌన్ : ముద్దనూరు– గోరంట్ల నేషనల్ హైవే 716జీ రోడ్డు నిర్మాణంపై సమావేశం తూతూమంత్రంగా నిర్వహించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ చిన్నయ్య, తహసీల్దార్ నజీర్ అహమ్మద్ ముద్దనూరు– గోరంట్ల వరకు వయా పులివెందుల మీద నిర్మిస్తున్న 716జీ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ నిమిత్తమై ఆ భూములు కోల్పోతున్న ప్రజలతో సమావేశం నిర్వహించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ వస్తారని తొలుత ప్రకటించారని, కానీ హాజరు కాలేదన్నారు. మున్సిపల్ కమిషనర్, సంబంధిత హైవే అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా హాజరు కాలేదన్నారు. ఈ నేషనల్ హైవే నిర్మాణం తుమ్మలపల్లి నుంచి వయా జగనన్న కాలనీ మీదుగా వెళ్తే ఎవరికీ నష్టం ఉండదన్నారు. సాధారణంగా నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి ఊరు వెలుపల 32 మీటర్ల రోడ్డును, ఊరిలో 26 మీటర్ల రోడ్డును నిర్మాణం చేయాలని నిబంధనలు ఉన్నాయని వాటిని అధికారులు తుంగలో తొక్కుతున్నారన్నారు. త్వరలో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను తెలియజేస్తామన్నారు.


