రాయలసీమకు జీవనాడి ఎత్తిపోతల పథకం
● ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి
కడప కార్పొరేషన్ : రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చడానికే ఎత్తిపోతల పథకం చేపట్టనట్లు ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం శాసన మండలిలో ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు చేపట్టి 100 టీఎంసీల క్రిష్ణానీటిని తరలించుకుపోతోందన్నారు. కల్వకుర్తిలో 25 టీఎంసీలకుగాను 50 టీఎంసీల నీటిని తోడేస్తున్నారన్నారు. క్రిష్ణా నదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతో ఇంతకు ముందు ఉన్న 60 వరద రోజులు 30 రోజులకు పడిపోయాయనన్నారు. రాయలసీమలోని ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీలు, తెలుగు గంగకు 40 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీలు, చైన్నె త్రాగునీటికి 15 టీఎంసీలు, గాలేరు నగరికి 38 టీఎంసీలు, సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీలు చొప్పున నీరు అవసరమన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు 7వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేసుకునేందుకు వీలుంటుందన్నారు. శ్రీశైలంలో 880 అడుగుల నీటి మట్టం ఉంటే తప్పా సీమ ప్రాజెక్టులకు సాగునీరు అందదదన్నారు. కావున 841 బెడ్ లెవెల్‌లో ఉన్న పోతిరెఓడ్డిపేఆడు హెడ్‌రెగ్యులేటర్ ఒక్కటే రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చలేదన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీశైలం ఫోర్ షేర్‌లో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారన్నారు. ఈ మేరకు రూ.3825 కోట్లతో పరిపాలన అనుమతులు సాధించారని, ఈలోపు ఎన్నికలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాయలసీమ జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపేశారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు తిరుగులేని నిదర్శనమన్నారు.రాయలసీమ జీవనాడి అయిన ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఎప్పటి నుంచి మొదలు పెట్టి ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు.


