అధోజగత్తు.. మత్తులో చిత్తు! | - | Sakshi
Sakshi News home page

అధోజగత్తు.. మత్తులో చిత్తు!

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 12:22 PM

-

గంజాయి మత్తులో మునిగితేలుతున్న యువత 

మత్తులో మర్డర్లు చేయడానికి వెనుకంజ వేయని ఉన్మాదులు 

ఇటీవల గంజాయి సేవించి రైలు కిందపడ్డ ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు 

గంజాయి మత్తులో చిన్నారిని చిదిమేసిన నిందితుడు 

గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం విఫలం  

యువత పెడదోవ పట్టింది. అధికారుల నిర్లక్ష్యం.. కూటమి ప్రభుత్వ అలసత్వం.. వెరసి యువత గం‘జాయ్‌’లో మునిగితేలుతోంది. మంచేదో.. చెడేదో మరిచి.. తన..మన విచక్షణ గాలికొదిలి మత్తులో చిత్తవుతోంది.  అధోజగత్తులో విహరిస్తోంది. హత్యలు.. అత్యాచారాలకు ఒడిగడుతోంది. కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని నెలలుగా వెలుగు చూస్తున్న ఘటనలు సమాజ భద్రతను ప్రశ్నిస్తున్నాయి. భావిభారత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.  

2025 జనవరిలో నిమ్మనపల్లి మండలంలో మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతురుపైనే అత్యాచారం చేసిన సంఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న భార్య  భర్తను మందలించడంతోపాటు మద్యం మత్తులో ఇలా చేస్తున్నాడని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.  

ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు రైలు పట్టాలపైనే పీకల్లోతు మద్యం తాగారు. రైలు వస్తుందన్న స్పృహ కూడా లేకుండా పట్టాలపైనే పడుకున్నారు. అంతే నిమిషాల్లో రైలు ఢీకొంది.. 2025 డిసెంబరులో పీలేరు నియోజకవర్గంలోని కలికిరి మండలంలో ఈ విషాదఘటన చోటు చేసుకుంది.  

ఈనెల 9న మదనపల్లె–తిరుపతి ప్రధాన రహదారిలోని యర్రగానిమిట్ట వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నెంబరు లేని లగేజీ ఆటోపైన ఉల్లిపాయల బస్తాల కింద 9 బస్తాల్లో దాచిన 179 కిలోల గంజాయి కనుగొన్నారు. దీని విలువ రూ.44.65 లక్షలుగా ఉంటుందని అంచనా.  

ఈ ఏడాది ఫిబ్రవరి 3న జిల్లాలోని పెద్ద తిప్పసముద్రం మండలం మల్లేల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పొలంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు.  పోలీసులు దాడులు నిర్వహించి రూ.10 లక్షల విలవైన 10 కిలోల గంజాయిని స్వా«ధీనం చేసుకున్నారు.   

సాక్షి అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు గంజాయిని కూకటి వేళ్లలో పెకళిస్తున్నామని చెబుతున్నా.. మరోవైపు అదే గంజాయి మత్తులో యువత జోగుతోంది.    ఒక్క గంజాయే కాదు...విచ్చలవిడిగా ఏర్పాటైన మద్యం షాపులతో మత్తెక్కిన మందు బాబులు చేస్తున్న వికృత చేష్టలు కలకలం రేపుతున్నాయి. మద్యం మత్తులో కన్నతల్లిని పొట్టనబెట్టుకుంటున్నారు...కట్టుకున్న భార్యను కడతేర్చుతున్నారు...డబ్బులివ్వలేదని తండ్రినే మట్టుపెడుతున్నారు. ఇక గంజాయి మత్తులో ఏం చేస్తున్నామో తెలియక పక్కనున్నది తల్లో, చెల్లో అర్థం కాకుండానే కామాంధులు కాటేస్తున్నారు. అంతేకాకుండా అభం శుభం తెలియని పసికందుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు. జిల్లాలో మత్తులో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క మత్తు వ్యవహారంలో కూడా ఇతర అనేక నేరాల విషయంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో పోలీసులు అసాంఘిక వ్యవహారాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.  

ప్రాణాలకు తప్పని ముప్పు

జిల్లాలో గంజాయి, మద్యం మత్తుకు బానిసైన వారు వారి ప్రాణాలతో పాటు  ఇతరుల ప్రాణాల మీదికి తెస్తోంది. మత్తులో వారు ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారంగా వాహన డ్రైవింగ్‌ చేస్తూ ఎదుటివాటి ప్రాణాల పోవడానికి కారణమవుతున్నారు. అంతేకాకుండా మత్తుకు అలవాటుపడిన వ్యసనపరులు ఏకంగా డబ్బుల కోసం ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రాణాలను తీసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు.   

విశాఖ, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి గంజాయి రవాణా

ఒరిస్సా, విశాఖపట్టణం ప్రాంతాల నుంచి ఇక్కడికి గంజాయి సరఫరా అయినట్లు తెలుస్తోంది.  విక్రయించే వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి అందిన సమాచారం మేరకు విశాఖ, పాడేరు, అరకు, ఒరిస్సా, విజయవాడ తదితర ప్రాంతాలనుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్న నేపద్యంలో నేరస్తులు కూడా రూట్లు మారుస్తున్నారు. గంజాయిని విక్రయించే ముఠాలను ఎక్కడికక్కడ పట్టణాల్లో పసిగట్టి తాట తీస్తేనే చిన్నారుల భవిష్యత్తుకు భరోసా 
ఉంటోంది.  

అకారణంగా దాడి 

పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉదయగిరిరాజా. ఈయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేటలోని మారుతీ ప్రసన్న లాడ్జి క్లాంపెక్స్‌లో ఉన్న కెనరా బ్యాంక్‌ ఏటీఎం వద్ద కాపలా కాస్తుంటారు. అనుమానాస్పద స్థితిలో బ్యాంకులోకి వెళుతున్న యువకులను ప్రశ్నించిన క్రమంలో మద్యం మత్తులో ఉన్న వారు ఆగ్రహంతో ఊగిపోయారు. రాజాపై అక్కడే ఉన్న చైర్‌తో దాడిచేయడంతో తలకు గాయమైంది. రాజంపేట ప్రాంతీయవైద్యశాలలో చికిత్స పొందారు. యువకులపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్న ప్రాంతంలో ఎదురుగా (మారుతీప్రసన్న లాడ్జీ) బ్రాందీషాపు ఉంది. సాయంత్రం నుంచే ఈ ప్రాంతంలో మద్యం ప్రియుల రగడ అంతాఇంతా కాదు.     –రాజంపేట

మత్తులో స్నేహితుడి హత్య 

మద్యం షాపు వద్ద వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. చివరకు అదే మద్యం మత్తు ఒకరిని బలి తీసుకుంది. వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని నాగులకట్టవీధికి చెందిన వినయ్, రాయచోటిలోని ఎన్జీఓ కాలనీకి చెందిన గువ్వల సుబ్రమణ్యం స్నేహితులు. çసుబ్రమణ్యం కొద్దిరోజులుగా పనులు చేసుకుంటూ ప్రొద్దుటూరులో ఉంటున్నాడు. వీళ్లిద్దరూ మద్యం తాగేందుకు తరచూ ఒక వైన్‌షాపు వద్దకు వెళ్తుండగా స్నేహితులయ్యారు. మద్యం తాగే సమయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సుబ్రమణ్యం వినయ్‌ కుటుంబ సభ్యులను దూషించాడు. దీంతో ఎలాగైనా అతడిని హతమార్చాలని వినయ్‌ పథకం పన్నాడు. ఈ నెల 13న మద్యం తాగేందుకు సుబ్రమణ్యంను వినయ్‌ తన ఇంటికి పిలిచాడు. సుబ్రమణ్యం ఇంటికి రాగానే మద్యం మత్తులో ఉన్న వినయ్‌ కత్తితో పొడిచి చంపేశాడు. –ప్రొద్దుటూరు క్రైం    

కోమాలో యువకుడు.. 

మదనపల్లి సీటీఎం రోడ్డులో ఈనెల 25న మద్యం మత్తులో ఇద్దరు యువకులపై హత్యాయత్నం జరిగింది. చంద్రకాలనీకి చెందిన ప్రదీప్‌ (32), బాలాజీ నగర్‌లో ఉండే బాలకృష్ణ (బాలు), రాజానగర్‌కు చెందిన నరేశ్‌ బాలాజీనగర్‌ లోని మద్యం షాపుకు వెళ్లారు. మద్యం తాగే క్రమంలో షాపులోనే గొడవ పడి బయటకు వచ్చారు. ఈ క్రమంలో కురబలకోట మండలం, అంగళ్లుకు చెందిన బ్రహ్మతేజ బ్రదర్స్‌ తన అనుచరులతో ప్రదీప్, బాలుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రదీప్‌ కోమాలో ఉన్నాడు. –మదనపల్లె టౌన్‌

గప్పు మంటున్న గంజాయి 

చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చాక గంజాయిని కూకటి వేళ్లతో పెకళిస్తున్నామని పైకి తెలియజేస్తున్నా వాస్తవ పరిస్థితిలో మాత్రం గంజాయి గుప్పుమంటోంది. ప్రధానంగా నిరుద్యోగులు, యువతను టార్గెట్‌ చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా సరుకును సరఫరా చేస్తున్నారు. గతేడాది పీలేరు నియోజకవర్గంలో ఇంటరీ్మడియేట్‌ విద్యార్థులు గంజాయి సేవించి రైలు పట్టాలపై విగత జీవులుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. రాయచోటితోపాటు మదనపల్లె, పీలేరు ఇలా అనేక చోట్ల చాపకింద నీరులా గంజాయి సరఫరా సాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో గంజాయి తీసుకొస్తుండడం ఒకెత్తయితే..  పేటీఎం మండలంలోని ఒక గ్రామంలో ఏకంగా గంజాయిని పండిస్తుండడం కలవరపరిచే అంశం.   గంజాయి విషయంలో పోలీసులు  కట్టుదిట్టమైన చర్యలకు  ఉపక్రమించకపోతే యువత భవిష్యత్తు అం«ధకారమయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే గంజాయి మత్తులో వారు చేస్తున్న వికృత చేష్టలు ప్రజలను సైతం బెంబేలెత్తిస్తున్నాయి.  

వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన.. 
మదనపల్లి మండలం, సీటీఎం రైల్వే స్టేషన్‌ పట్టాల వద్ద గత ఏడాది ఆగస్టు 15న మదనపల్లెకు చెందిన సుల్తాన్, మరి కొందరు అంగళ్లులో భవన నిర్మాణం పనులు చేసే వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన ఖదీర్‌ (30)తో  గంజాయి విషయంలో గొడవలు తలెత్తి హత్య చేశారు.  
–మదనపల్లె టౌన్‌

అంగడిలో..అందుబాటులో.. 

చింతకొమ్మదిన్నె: గంజాయి వ్యసనంతో చాలామంది యువకులు తమ జీవితాన్ని ఛిద్రం చేసుకుంటూ కుటుంబాలను కష్టాలపాలు చేస్తున్నారు. ఇటీవల చింతకొమ్మదిన్నె మండలంలోని పలు ప్రాంతాలలో, ముఖ్యంగా నగర పరిధిలోకి చేరిన ఇందిరానగర్, బాబానగర్, మేరీనగర్‌ ప్రాంతాలలో గంజాయిని విచ్చలవిడిగా సేవిస్తున్నారు. బాబానగర్, అంగడివీధి ప్రాంతంలో కొందరు బహిరంగంగానే స్కూటీ డిక్కీలలో గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇటీవల ఉటుకూరు ప్రాంతంలో బహిరంగంగా గంజాయి చెట్టును పెంచగా పోలీసులు కొందరిపై చర్యలు తీసుకున్నారు. గంజాయికి బానిసలైన బయటి రాష్ట్రాల వారు తక్కువ బాడుగలకు ఇక్కడ నివాసాలు లభిస్తాయనే కారణంతో చేరి, వివిధ చోట్ల పనులు చేసుకుంటూ స్థానికులను కూడా చెడగొడుతున్నారు.

గంజాయి కోసం గ్యాంగ్‌వార్‌ 

గుర్రంకొండ: మండలకేంద్రమైన గుర్రంకొండలో గంజాయి బ్యాచ్‌లు వీరంగం సృష్టించాయి. పట్టణంలో రెండు బ్యాచ్‌లు పరసర్పరం దాడులు చేసుకోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలొ బయట రాష్ట్రాల నుంచి పనులు చేసుకోవడానికి వచ్చిన కొంత మంది ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. మరోవైపు స్థానికంగా నివాసముంటున్న మరికొంతమంది ఒక గ్యాంగ్‌గా ఏర్పడి గంజాయి బ్యాచ్‌లు చలామణి అవుతున్నారు. ఇటీవల రెండు బ్యాచ్‌లు గంజాయి క్రయవిక్రయాలు, డబ్బులు వసూళ్లపై పాత పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఘర్షణ పడ్డారు. ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి దాడులు చేసుకోగా ఇరువురికి రక్తగాయాలు అయ్యాయి. అక్కడి నుంచి పట్టణంలోని కేఏ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల వద్ద మళ్లీ ఘర్షణ పడ్డారు. రాత్రిళ్లు ఇష్టానుసారం గంజాయి గ్యాంగ్‌లు ఘర్షణలకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నాయి.

బోయకొండ..అక్రమార్కులకు కూటమి నేతల అండ 

చౌడేపల్లె: అన్నమయ్యజిల్లా చౌడేపల్లె మండలం దిగువపల్లె పంచాయతీ పరిధిలోగల బోయకొండఅటవీప్రాంతం,భవానీనగర్, గంగాపురం, ఆర్‌ఆర్‌కాలనీ ప్రాంతాల్లో    అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. మండలంలోని ప్రతిపల్లెలోనూ బెల్టుషాపుల  దందా సాగుతోంది. కూటమి నేతల అండతో  విచ్చలవిడిగా పేకాట, వ్యభిచారం, కోడిపందెం, మత్తు పదార్థాల విక్రయాలకు పోలీసులే సహరిస్తున్నారని ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి.   ఉదయం సూర్యోదయానికి ముందే పల్లెల్లో విచ్చలవిడిగా బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు  చేస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  బోయకొండ యాత్రికులకు పవిత్ర స్థలంకావడంతో ఇక్కడికి  నిత్యం వివిధ ప్రాంతాలనుంచి  వేలాది మంది వస్తుంటారు. ఈక్రమంలో అదే రీతిలో  అసాంఘీక కార్యక్రమాలు  జోరుగా సాగుతున్నాయని చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి.  

31 మంది అరెస్టు 
కురబలకోట: మండలంలో గత ఒకటిన్నర సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదైనట్లు ముదివేడు ఎస్‌ఐ మధు రామచంద్రుడు గురువారం తెలిపారు. అక్రమ  రవాణా, విక్రయాలపై ముదివేడు పోలీసులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసుల్లో 31 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుండి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఓరిస్సా, అరకు వ్యాలీ, నర్సీపట్నం ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  

‡‡ భార్యాభర్తలు సహా.. 

వైఎస్సార్‌ జిల్లా వల్లూరు మండల పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గత నెల అంటే జనవరి 19న అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజా యిని స్వా«దీనం చేసుకున్నారు. కమలాపురం మండలం రామచంద్రాపురానికి చెందిన పోతు రాజు ప్రభాస్‌ అలియాస్‌ బన్ని, ఖురైషీ మహ్మద్‌ ఉస్మాన్‌తో పాటు గోటూరు గ్రామానికి చెందిన భార్యభర్తలు షేక్‌ సోను, షేక్‌ షబానాలు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.  –వల్లూరు

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు 

కూటమి ప్రభుత్వం ఏ క్షణాన కొలువుదీరిందోగానీ మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలు ‘మత్తు’లో మాయమయ్యాయి. జిల్లాలో సమయం, సందర్బం లేకుండా మద్యం షాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి తెరవాల్సిన షాపులు 6 గంటల నుంచే తెరుస్తున్నారు. మరోవైపు మద్యం షాపులకు తోడుగా బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు కావడం, ఇంకోవైపు మద్యం విచ్చలవిడిగా దొరకుతుండడంతో ఎక్కడపడితే అక్కడ మందుబాబులు కనబడుతున్నారు. ఇటీవల అధికార పార్టీ నాయకులే నడుపుతున్న కల్తీ మద్యం ఫ్యాక్టరీ బయటపడటం సంచలనం కలిగించింది. అంటే ప్రజల ప్రాణాలతో లేక్కలేకుండా కల్తీ మద్యానికి పాల్పడిన అధికారపార్టీ వ్యవహారాన్ని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా మద్యం, బెల్ట్‌షాపులను కట్టడి చేయడంతోపాటు మత్తు పదార్థాల విషయంలో పోలీసులు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement