జలహారతిలో భగ్గుమన్న వర్గవిభేదాలు!
● వేదికపై ఆశీనులయ్యే విషయంలో అభ్యంతరాలు
● పెదవి విరిచిన మన్నూరు టీడీపీ నేతలు
● కార్యక్రమం నుంచి నిష్క్రమణ
రాజంపేట: మండలంలోని మన్నూరు చెరువు జలహారతి కార్యక్రమంలో టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి.జలహారతికి టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు హాజరయ్యారు. ఆయనతోపాటు మన్నూరు చెరువు నీటి సంఘం అధ్యక్షులు రామచంద్ర, చెర్లోపల్లె టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన్నూరు చెరువు జలహారతిలో చెర్లోపల్లెకు చెందిన చమర్తి సామాజికవర్గ నాయకులు పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. జలహారతి వేదికపైకి మన్నూరుకు చెందిన వారిని ఆహ్వానించాలి.. కానీ తన సామాజికవర్గానికి చెందిన వారు వేదికపై ఆశీనులు కావడాన్ని మన్నూరు టీడీపీ నేతలు వ్యతిరేకించారు. చెర్లోపల్లెకు చెందిన నాయకులకు హస్తవరం చెరువు ఒకటి ఉందని, ఆ చెరువు జలహారతిలో పాల్గొనడం సబబని అన్నారు. మన్నూరు చెరువు పరిధిలో ఉన్న రైతులను, గ్రామపెద్దలను , టీడీపీ నాయకులను పక్కనపెట్టడంపై అసంతృప్తి వెళ్లగక్కారు. కార్యక్రమం నుంచి నిష్క్రమించారు.
ఆ రెండు సామాజికవర్గ నేతలుంటే టీడీపీనా..
ముగ్గురు నాయుళ్లు, పదిమంది రాజులు ఉంటనే టీడీపీనా అని మన్నూరుకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని మన్నూరు నాయకులు చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాజంపేట టీడీపీ లో వర్గ రాజకీయాల వ్యవహారం బట్టబయలైంది. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొండూరు శరత్‌కుమార్‌రాజు, మేడికొండు రవికుమార్, క్షత్రియ కార్పోరేషన్ డైరక్టరు అద్దెపల్లె ప్రతాప్‌రాజు, ఉద్దండం సుబ్రమణ్యం, రామ్మోహన్, అనుసూయమ్మ,సుబ్బరాజు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


