భూముల రిజిష్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వాలి
జమ్మలమడుగు : రాజోళి ప్రాజెక్టు నిర్మాణం కోసం పెద్దముడియం మండలంలోని నెమళ్లదిన్నె, బలపనగూడురు, గరిశలూరు, చిన్నముడియం, పెద్దముడియం ప్రాంతాల్లోని రైతుల వద్ద నుంచి నాలుగువేల ఎకరాల భూమిని సేకరించారు.అందులో 2500 ఎకరాలను గత మూడు సంవత్సరాల కిందట జీఎన్‌ఎస్‌ఎస్ అధికారులు అవార్డు పాసు చేసి ఎకరాకు 12.5లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వారికి పరిహారం ఇవ్వలేనప్పుడు అవార్డు నుంచి ఆ భూములను తొలగించి రైతులు అమ్ముకోవటానికి బ్యాంకుల నుంచి రుణాలను పొందేవిధంగా అనుమతులు ఇవ్వాలనిఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ రాజోళి ఆనకట్ట నిర్మాణంపై ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారాలోకేష్, చంద్రబాబు నాయుడు రాజోళి ప్రాజెక్టు ముంపువాసులకు పరిహారం పెంచి ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడి శాసనసభ్యుడు ఏకంగా ఎకరాకు 24లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న తర్వాత రైతుల గురించి ఈ ప్రభుత్వం పూర్తిగా మరచిపోయిందన్నారు. అవార్డు పాసైన ఆ భూములను అమ్మకాలు, కొనుగోలు చేయటానికి, బ్యాంకులనుంచి రుణాలు పొందటానికి వీలులేదని భూసేకరణ చట్టం కింద రైతులనుంచి సంతకాలు సేకరించారు. సమాచార హక్కు చట్టం కింద జీఎన్‌ఎస్‌ఎస్ అధికారులు రాతపూర్వకంగా 2500 ఎకరాల భూమిని సేకరించి అందులో 1700 ఎకరాలకు పైగా అవార్డు పాసు చేసి ఎకరాకు రూ. 12.5 లక్షలు పరిహారం ప్రకటించామని ఇచ్చారు. కాని శాసన మండలిలోనే మంత్రి, సెక్రటరీలు తప్పుడు సమాచారం ఇచ్చి సభనే తప్పు దోవ పట్టించారన్నారు. మండలికి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వివరించారు.


