జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య
కమలాపురం: చెడు వ్యసనాలకు బానిసై.. అనారోగ్యానికి గురై.. చివరకు జీవితం పై విరక్తి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కమలాపురం మండలం గంగవరంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తికి చెందిన మల్లె గురుమూర్తి (40) బేల్దారి పని చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే మద్యానికి అలవాటు పడి భార్య పిల్లల్ని పట్టించుకో కుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రొద్దుటూరులోని మేదర వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతిగా మద్యం తాగడం, విచ్చల విడిగా తిరగడం వలన అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కమలాపురం మండలంలోని గంగవరం బ్రాంది షాపు వద్దకు చేరుకుని రాత్రి పొద్దు పోయే మద్యం తాగాడు. అనంతరం సమీపంలోనే ఉన్న విద్యుత్ టవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం తెల్లవారు జామున అటుగా వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విద్యుత్ టవర్ నుంచి కింది దించి.. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


