మామిడిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
మైదుకూరు : మామిడి సాగులో యాజమాన్య పద్ధతులను పాటించాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ సీహెచ్ రూత్ అన్నారు. మైదుకూరు మండలం వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం 9వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న డాక్టర్ రూత్ మాట్లాడుతూ మామిడి పంటను ఆశించే నల్లతామర నివారణకు వేప నూనెను వాడాలని సూచించారు. బయోచార్‌పై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ బి.గోవిందరాజులు మాట్లాడుతూ పట్టు పరిశ్రమపై శిక్షణ అందించాలన్నారు. అరటి, నిమ్మ, బత్తాయి పంటలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. బయో రీసోర్స్ సెంటర్ డీడీఏ ఎం.నాగరాజు మాట్లాడుతూ మెట్ట వ్యవసాయంలో ఉద్యాన పంటలను జోడించి సాగు చేయాలన్నారు. ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఫర్టిగేషన్ ఆటోమేషన్‌పై ఉన్న సబ్సిడీల గురించి తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ మాట్లాడుతూ రైతులు ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలని, ఆయిల్ ఫాంలో సబ్సిడీలపై, చీనిలో వేరుకుళ్లు తెగులు యాజమాన్యంపై ఎక్కువగా అవగాహన కల్పించాలని సూచించారు. మైదుకూరు ఇన్‌చార్జి పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ గురివిరెడ్డి మాట్లాడుతూ చిన్న జీవాలకు పాడి పశువులకు ప్రతి మూడు నెలలకు నట్టల నివారణ మందును తాపించాలని తెలిపారు. పట్టు పరిశ్రమ ఏడీ దీక్షిత్ మాట్లాడుతూ సెరిక్లచర్‌లో రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కేవీకే అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఎం.బాలకృష్ణ 2025–26లో కేవీకే చేపట్టిన కార్యక్రమాలు, శిక్షణలు, ఇతర విస్తరణ కార్యక్రమాలను వివరించారు. 2026–27లో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళిక గురించి తెలిపారు. ఐఎన్‌ఏ శ్రీనివాసులు, నాబార్డ్ ఏజీఎం విజయవిహారి, ఎల్డీఎం జనార్దన్, ప్రకృతి వ్యవసాయ విభాగం డీపీఎం ప్రవీణ్, పులివెందుల అరటి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శివరామకృష్ణ, ఊటుకూరు కేవీకే పీసీ డాక్టర్ అంకయ్య కుమార్, డాట్ సెంటర్ అధిపతి డాక్టర్ కృష్ణప్రియ, అనంతరాజుపేట ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సందీప్‌నాయక్, వనిపెంట కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీవిద్యారాణి, డాక్టర్ విజయనిర్మల, డాక్టర్ ఫిరోజ్ హుస్సేన్, డాక్టర్ కాంతిశ్రీ, ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ కరుణశ్రీ, అభ్యుదయ రైతులు బీపీ ప్రతాప్‌రెడ్డి, బాల నరసింహారెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్లను డాక్టర్ రూత్, డాక్టర్ గోవిందరాజులు, డాక్టర్ కరుణశ్రీ ద్వారా పంపిణీ చేశారు.


