● నేడు కడపలో సదస్సు
సాక్షి ప్రతినిధి, కడప: నోరు ఒకటి చెబితే, నొసలు ఇంకోటి చేస్తోంది. దేని పని దానిదే. అచ్చం అలాగే కన్పిస్తోంది, అధికార పార్టీ నేతల ధోరణి. రాయలసీమ ఎత్తిపోతల పథకం స్వయంగా తానే మాట్లాడి నిలిపేయించానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడానని చెప్పారు. తద్వారా రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ నేతలు నిలదీస్తుంటే జవాబు చెప్పాల్సిన ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా నోరుమెదపలేదు. పైగా ఎదురుదాడి చేస్తున్నారు. పోనీ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కోసం చిత్తశుద్ధి చూపుతారా...అంటే అదీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాయలసీమకు చంద్రగ్రహణం అవహించిందని నిపుణులు వాపోతున్నారు.
● అనాదిగా రాయలసీమ వివక్షతకు గురైతోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత ఎంవీ రమణారెడ్డి, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి లాంటి ఉద్దండులు ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు నేతలతో కలిసి అనేక ఉద్యమాలు చేపట్టారు. ఫలితంగా నాటి సీఎం ఎన్టీరామారావు 1988లో గాలేరు–నగరి, ఆ తర్వాత హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులను ప్రకటించి శంకుస్థాపన చేశారని నాటి రాయలసీమ ఉద్యమకారులు వెల్లడిస్తున్నారు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకాలు కార్యరూపం దిశగా అడుగులు వేశాయి. 1995లో అనూహ్యంగా అధికారిక పగ్గాలు చేజెక్కించుకున్న చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఓమాట..తర్వాత మరోమాట చెబుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ విషయాన్ని చరిత్ర స్పష్టం చేస్తోంది.1996 పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం గండికోట ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆపై నిర్మాణాన్ని విస్మరించారు. మళ్లీ ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవాలి కాబట్టి 1999 సాధారణ ఎన్నికలకు ముందుగా 1998లో వామికొండ వద్ద మరోమారు శంకుస్థాపన చేశారు. గద్దెనెక్కిన తర్వాత మళ్లీ విస్మరించారు. అంతేకాదు, రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణపై సమగ్ర రిపోర్టు ఇవ్వాలంటూ కృష్ణస్వామి కమిటీ వేసి జీఎన్‌ఎస్‌ఎస్‌కు అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌కు గండికొట్టే ప్రయత్నాలు చేశారని విశ్లేషకులు వివరిస్తున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టుకు ఆయన ఖర్చు చేసింది 67.50 కోట్లు మాత్రమే. అది కూడా సిబ్బంది జీతభత్యాలకే. ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం చేస్తోంది. పైగా రాయలసీమ సాగు, తాగునీరు అందాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉంచాలి. కాగా అప్పటి చంద్రబాబు సర్కార్ జీవో నంబర్ 69 జారీ చేసి శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగులకు కుదించడం ద్వారా రాయలసీమ మరణశాసనాన్ని లిఖించారని పలువురు వివరిస్తున్నారు. అప్పట్లో అలా వ్యవహరించిన చంద్రబాబు సర్కార్ తాజాగా రాయలసీమ జిల్లాకు ప్రాణపథమైన రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఆర్డీఎంపీ) నిర్వీర్యం దిశగా చర్యలు చేపట్టారు.
సీమ ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వైఎస్..
2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వైఎస్‌రాజశేఖరరెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కార్యరూపం దాల్చాయి. జీఎన్‌ఎస్‌ఎస్ మొదటిదశ పనులల్లో భాగంగా అవుకు నుంచి గండికోటకు వరదకాలువ, గండికోట రిజర్వాయర్, టన్నెల్, వామికొండ, సర్వరాయసాగర్ పనులు సుమారు 85 శాతం పూర్తి చేశారు. అవుకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.8 టీఎంసీలకు పెంపు, గోరకల్లు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కుల నీరు డిచార్జి చేసుకునే వీలుగా విస్తరింపజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం, టీఆర్‌ఎస్, కోస్తా ప్రాంతం టీడీపీ నాయకులు సంయుక్తంగా జతకట్టి అనేక అడ్డంకులు సృష్టించారు. జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణపు పనులు దృష్టిలో ఉంచుకొని అప్పటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ఆరోపణలు గుప్పించిన నాయకుల అందరి నోర్లు మూయించి, ఒప్పించి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణ సామర్థ్యం పెంచారని నిపుణులు వివరిస్తున్నారు. జీఎన్‌ఎస్‌ఎస్ పథకంలో తొలుత గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఆయ్యాక పులివెందుల నియోజకవర్గానికి తాగు, సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ పథకానికి రూపకల్పన చేశారు. పైడిపాలెం వద్ద 6టీఎంసీల సామర్థ్యంతో రూ.727కోట్ల అంచనా వ్యయంతో పైడిపాళెం రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. తద్వారా తొండూరు, సింహాద్రిపురం, కొండాపురం మండలాల్లోని చెరవులను నింపి 47,500 ఎకరాలకు కొత్తగా సాగునీరుతో పాటు, పిబిసీ కింద 41,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణతో పాటు, పలు గ్రామాలకు తాగునీరు అందించాలనే సంకల్పం పుచ్చుకున్నారు.
సీఎం చంద్రబాబుపై భగ్గుమంటున్న రాయలసీమ వాసులు
కుట్రలతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల
రాయలసీమ ఎత్తిపోతల పథకం తానే ఆపించానని ప్రకటించిన తెలంగాణ సీఎం
ఇప్పటికీ ఆ విషయమై నోరుమెదపని సీఎం చంద్రబాబు
ఏకం కానున్న ఐదు జిల్లాల సాగునీటి నిపుణులు, విపక్షాలు
ప్రత్యక్ష కార్యచరణకు రంగం సిద్ధం
కడప అర్బన్: రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాల సదస్సు కడపలోని పాత రిమ్స్ ఆవరణలో ఉన్న బీసీ భవన్ లో ఈనెల 24న ఉదయం 10:30 గంటలకు జరగనుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణ ఈ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, మేధావులు, ప్రజా ప్రతినిధులు విచ్చేయనున్నారు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, కడప ఉక్కుతో పాటు విభజన హామీలను అమలు చేయాలని, కడప–బెంగళూరు రైల్వే లైన్ అమరావతి వరకు పొడిగించాలని తదితర డిమాండ్ల సాధనకు కృషి చేసేందుకు, భవిష్యత్తులో వాటిని సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
● నేడు కడపలో సదస్సు
● నేడు కడపలో సదస్సు


