● కరువు నివారణకుప్రత్యేక ప్రణాళిక....
అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం కుయుక్తులతో ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వెరశి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాయలసీమ కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కొరత లేకుండా ఉండేందుకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఆర్డీఎంపీ) ప్రణాళికలు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటిమట్టం వద్ద ఎత్తిపోతల పథకానికి 2020లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. రోజులకు 3టీఎంసీల చొప్పున నీరు డ్రా చేసుకునే వీలుగా కార్యాచరణ చేపట్టింది. తద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు పుష్కలంగా ఉండే చర్యలు చేపట్టింది. అలాగే జిఎన్‌ఎస్‌ఎస్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అనుసంధానం ప్రక్రియను ప్రారంభించి వేగవంతంగా పనులు చేపట్టింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలో జంగందేవరపల్లె వద్ద నీరు కలపడం ద్వారా పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, రాయచోటి నియోజకవర్గాలను సస్యశామలం చేసేందుకు యోగ్యకరంగా మారింది. ఇప్పుడా ఆ ప్రాజెక్టులన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు సర్కార్ నిలిపేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థన మేరకు రాయలసీమ వాసులకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


