గరుడునిపై ఘనశ్యాముడు
కడప సెవెన్‌రోడ్స్: ఆ క్షేత్రం మాడవీధులన్నీ భక్తిభావంతో భజనలు చేస్తున్న భక్తులతో నిండిపోయాయి. ఒకవైపు మంగళ వాయిద్యాల హోరు..మరోవైపు కళాకారుల కోలాటాలు..ప్రతిధ్వనించిన గోవిందనామ స్మరణలు..దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల శోభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి ముత్యపు పందిరి వాహనంలో మాడవీధుల్లో విహరించారు. శ్వేతపందిరి నీడన రాజగోపాలుడిగా గంభీరంగా ఆశీనులైన స్వామి వారిని భక్తులు దర్శించుకుని పూజాద్రవ్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం తన భక్తులను కరుణించేందుకు ఘనశ్యాముడు విష్ణుమూర్తి గరుడునిపై కొలువుదీరాడు. మాడవీధుల్లో విహరించారు. భక్తులు విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్న ఆ దివ్య తేజోరూపుడిని దర్శించుకుని తన్మయులై అడుగడుగునా గోవిందనామ స్మరణలతో తరించారు. నిత్యం కోవెలలో కొలువుదీరే స్వామి ఉత్సవమూర్తిగా పవిత్ర క్షేత్రం మాడవీధుల్లో భక్తులను కరుణించేందుకు స్వయంగా తరలి వస్తున్నాడని సంతోషాన్ని కీర్తనల రూపంలోపాడి ఆనందించారు.
నేడు కల్యాణోత్సవం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి ఊంజలసేవ, అన్నమాచార్య కీర్తనల ఆలాపన నిర్వహిస్తారు. రాత్రి 8.00 గంటల నుంచి కల్యాణమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామిని గజవాహనంపై మాడవీధుల్లో ఊరేగించనున్నారు.
గరుడునిపై ఘనశ్యాముడు


