దైవ మార్గంతో జన్మధన్యం
నమాజ్ చేస్తున్న ముస్లింలు ఇస్తేమాలో గురువుల సందేశాలను ఆలకిస్తున్న ముస్లింలు
దీని ఇస్తేమా ప్రాంగణంలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు
కడప సెవెన్‌రోడ్స్: దైవ మార్గంతో మానవ జన్మకు సార్థకత చేకూరి జన్మధన్యమవుతుందని మత గురువులు సూచించారు. కడప నగర శివార్లలోని కొప్పర్తి వద్ద మూడు రోజులపాటు నిర్వహించనున్న దీని ఇస్తేమా శుక్రవారం తెల్లవారుజామున ఫజర్ నమాజ్ అనంతరం ప్రారంభమైంది. అప్పటికే కార్యక్రమ ప్రాంగణానికి లక్షలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులద్దేశించి గురువులు తమ సందేశాన్ని అందజేశారు. ప్రార్థనలు, భోజన విరామాల అనంతరం విడతల వారీగా ముస్లిం గురువులు, ప్రముఖులు తమ ప్రసంగాలను వినిపించారు. ఈ సందర్బంగా వారు దీని ఇస్తేమా ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉత్తమమైన మానవ జన్మను ప్రసాదించిన అల్లాహ్‌కు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అల్లాహ్ ప్రసన్నత కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అల్లాహ్ దూతగా భువిపైకి వచ్చిన మహమ్మద్ ప్రవక్త సూచించిన సన్మార్గంలో నడవాలన్నారు. సాటి మానవులకు ఆదర్శంగా జీవించాలని సూచించారు. రాత్రి ఇషా నమాజ్ తర్వాత తొలిరోజు కార్యక్రమాలు ముగిశాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్‌లు ఏర్పాట్లను పరిశీలించారు. కాగా కడప నగరంలో ఇంత భారీ స్థాయిలో ఇస్తేమా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
● ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు తరలి రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. స్థానికంగానే అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించారు. అలాగే మంచినీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
ప్రతి ఒక్కరూ అల్లాహ్ ప్రసన్నత కోసం
కృషి చేయాలి: మతగురువులు
ఘనంగా ప్రారంభమైన దీని ఇస్తేమా
దైవ మార్గంతో జన్మధన్యం
దైవ మార్గంతో జన్మధన్యం
దైవ మార్గంతో జన్మధన్యం


