ఐపీఓ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతిపాదిత ఐపీఓను తక్షణమే ఉపసంహరించుకోవాలని గ్రామీణ బ్యాంకు అధికార ఉద్యోగ సంఘాల నాయకులు మహమ్మద్, రాహుల్ తేజ్, వేణుగోపాల్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏపీజీబీ కడప రీజినల్ ఆఫీసు కార్యాలయ సమీపంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ఆర్‌బీఎస్ స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఒకవైపు ఢిల్లీలో స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతుండగా, 17.12.2025న కేంద్రం కేరళ గ్రామీణబ్యాంకు, తమిళనాడు గ్రామీణబ్యాంకు, హర్యాన గ్రామీణబ్యాంకులకు సంబంధించి 2026 మార్చి చివరి నాటికి ఐపీఓకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికలను సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆర్‌ఆర్‌బీ ఉద్యోగుల పోరాటాల ఫలితంగా ఒకప్పుడు 196గా ఉన్న గ్రామీణ బ్యాంకులు ప్రస్తుతం ఒక రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ విదానంలో 28 బ్యాంకులుగా రూపాంతరం చెందాయన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ , నాబార్డు నియమించిన వివిధ కమిటీలతోపాటు పార్లమెంటరీ ఆర్థిక కమిటీలు కూడా ఆర్‌ఆర్‌బీల పాత్రను ప్రశంసించాయన్నారు. ఆర్‌ఆర్‌బీలలో ఐపీఓ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్‌ఎం శ్రీనివాసప్రసాద్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్ రఘనాథరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. బ్యాంకు అధికారుల సంఘం నాయకులు జగదీష్, సందీప్, వలీ, యశ్వంత్, ప్రశాంతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


