వ్యక్తిగత కక్షతోనే ఆ ఫ్లెక్సీ వేశారు
● ఏడీపీ సర్వే ద్వారా ఇష్టం వచ్చినట్లు పన్నులు పెంచారు
● అందులో భాగంగానే
మా ఇంటి పన్ను కూడా పెరిగింది
● దీనిపై రివిజన్ పిటిషన్ వేసినా...
ఫైనల్ డిమాండ్ నోటీసు ఇవ్వలేదు
● అందుకే పన్ను చెల్లించలేదు
● నూతన మేయర్
పాకా సురేష్ కుమార్ వెల్లడి
కడప కార్పొరేషన్ : తనపై ఉన్న వ్యక్తిగత కక్షతో, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు వేశారని నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కార్పొరేన్ కార్యాలయంలోని తన చాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా కాకమునుపే కొందరు సర్కిళ్లలో ఫ్లెక్సీలు వేయడం దారుణమన్నారు. తానంటే గిట్టనివారు వారి ఆక్రోషాన్ని ఎలా చూపాలో తెలియక ఈ విధంగా వెళ్లగక్కారన్నారు. ఇంటి పన్ను అనేది ఎప్పటికై నా కట్టాల్సిందేనని, దాన్ని ఎవరూ మాఫీ చేయలేరన్నారు. ఇప్పుడు కట్టకపోతే ఎన్ని సంవత్సరాలకై నా వడ్డీతో సహా చెల్లించక తప్పదన్నారు. తన తల్లి పేరుతో ఉన్న ఆ ఇంటికి గతంలో రూ.12229 పన్ను వస్తుండగా, ఏడీపీ సర్వేలో భాగంగా దాన్ని పదింతలు పెంచారన్నారు. ఇలా తనకు మాత్రమే జరగలేదని, కడప నగరంలోని 20 వేల మందికి ఈ సర్వే ద్వారా పన్నులు పెంచారన్నారు. జీహెచ్‌ఎంసీ యాక్టు ప్రకారం ఇంటి యజమానులకు నోటీసు ఇచ్చిన తర్వాతే పన్ను పెంచాలని స్పష్టంగా ఉందన్నారు. సర్వే పేరిట అసంబద్ధంగా పెంచిన పన్నులను వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లమంతా తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తు చేశారు. పలు సర్వసభ్య సమావేశాల్లో ప్రజలందరి తరఫున తాము ఈ అంశాన్ని లేవనెత్తి పోరాటం చేస్తే, చివరకు ఏడీపీ సర్వేను నిలిపేశామని అధికారులు చెప్పారన్నారు. ప్లాన్ తీసుకొని ఇల్లు నిర్మించినప్పటికీ, లేనట్లుగా చూపి చాలా మందికి 100 శాతం ఫెనాల్టీ విధించారన్నారు. తమ ఇంటికి పెరిగిన పన్నుపై రివిజన్ పిటిషన్ సమర్పించామని, అధికారులు దానిపై విచారణ చేసి ఇప్పటికీ ఫైనల్ డిమాండ్ నోటీసు ఇవ్వనందునే పన్ను కట్టలేదని వివరించారు. కార్పొరేషన్ పరిధిలో ఇంకా 976 రివిజన్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఊరు, పేరు లేకుండా వేసే ఫ్లెక్సీలను ముద్రించవద్దని ప్రింటర్ల యజమానులకు సూచించారు. కార్పొరేషన్ అనుమతి పొందిన తర్వాతే ఫ్లెక్సీలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తామన్నారు. సాదారణ కుటుంబం నుంచి వచ్చిన అత్యున్నతమైన మేయర్ పదవి అధిరోహించాననే అక్కసుతో ఇలా చేసినట్లు కనిపిస్తోందని, ఫ్లెక్సీలు వేసి సమయం వృథా చేసుకోవద్దని, నగరాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వీలైతే సలహాలు ఇవ్వాలని కోరారు.


