ఏసీబీ డీఎస్పీగా సీతారామారావు
కడప అర్బన్: అవినీతి నిరోధక శాఖ కడప డీఎస్పీగా సీతారామారావును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి కడప ఏసీబీ డీఎస్పీ స్థానం ఖాళీగానే ఉంది. ప్రస్తుతం సీతారామారావును నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
కడప సెవెన్‌రోడ్స్: జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ పీఆర్‌డీ అండ్ ఇంజినీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు ఎంవీ రంగాచార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్ కడప యూనిట్ ఉపాధ్యక్షులు జి.కేశవులు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఎస్‌ఈ పీఆర్ మద్దన్న, ఎస్‌ఈ ఆర్‌డబ్ల్యూఎస్ ఏడుకొండలు, డీపీఓ రాజ్యలక్ష్మి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, డీడీఓ మైథిలి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప నగరంలోని సాయిబాబా హైస్కూల్‌లో 8వ తరగతి చదు వుతున్న సుజన్‌కుమార్ కర్రసాము పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. నగరంలోని చెమ్ముమియ్యాపేటకు చెందిన గడ్డం శ్రీనివాసులు కుమారుడు సుజన్ కుమార్ గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీల్లో ప్రతిభ కనపరిచి మెమెంటో అందుకున్నారు. తద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
గోపవరం : అర్హులందరికీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల అభివృద్ధి కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. అందరికీ ఉపయోగపడేలా పనులు గుర్తించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ రామలింగేశ్వర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి జుబేద, బద్వేలు డివిజన్ ఏపీడీ మైథిలి, ఎంపీడీఓ సురేష్‌బాబు, ఏపీఓ విజయమ్మ, ఈసీ జగన్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.


