ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది
● నిజాయితీగా వ్యవహరించిన
అధికారులకు అభినందనలు
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : జిల్లాలో జరిగిన కడప కార్పొరేషన్, ముద్దనూరు ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని, వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఉన్న ప్రేమ, అభిమానాలతో ఏ ఒక్కరూ ప్రలోభాలకు లొంగలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీతోపాటు పోలీసు సిబ్బంది, జేసీ అదితి సింగ్‌తోపాటు రెవెన్యూ అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని తెలిపారు. ఈ కారణంగానే టీడీపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయన్నారు. కడప కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న కె.సురేష్‌బాబును, ముద్దనూరు ఎంపీపీగా ఉన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డిలను సాంకేతిక కారణాలు చూపి తొలగించారన్నారు. కేవలం కూటమి నేతల కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేశారని విమర్శించారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి నాయకత్వంలో 39 మంది కార్పొరేటర్లు కలసి పాకా సురేష్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారన్నారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికల్లో ఒక రోజు అధికారులు సహకరించారన్నారు. నిజాయితీగా ఎన్నికలు జరిపినందుకు అధికారులకు రాచమల్లు అభినందనలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు ఇలాగే వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం మరింత ద్విగిణీకృతం అవుతుందన్నారు.
రూ.50 లక్షలు ఆఫర్ చేశారు
ముద్దనూరు ఎంపీపీ ఎన్నికల్లో ఒక్కొక్క ఎంపీటీసీకి కూటమి నేతలు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మొత్తం 9 మంది ఎంపీటీసీల్లో కూటమి పార్టీకి ఒక ఎంపీటీసీ మాత్రమే ఉండగా తర్వాత ఆ సంఖ్యను మూడుకు పెంచుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీటీసీలను లాగడానికి కూటమి నేతలు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు గుర్రం లావణ్య, రాగుల శాంతి, నూకా నాగేంద్రారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, నాయకులు చౌడం రవీంద్ర, ఎద్దుల రాయపురెడ్డి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.


