విద్యుత్ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
కడప కార్పొరేషన్ : విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణల పేరుతో ఈ ఏడాది అక్టోబర్ 9న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు బి. రామలింగారెడ్డి అన్నారు. గురువారం విశ్వేశ్వరయ్య భవన్‌లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు యు. లక్ష్మినారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ 57 పేజీల ముసాయిదా బిల్లులో డిస్కంలను పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించేందుకు పథక రచన చేశారన్నారు. జిల్లా నాయకుడు ఎం. బాలకాశి మాట్లాడుతూ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్–ఔట్ సోర్సింగ్ కార్మికులకు డిస్కంల ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. శివయ్య, ఎనర్జీ అసిస్టెంట్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె. మల్లికార్జున్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో డిస్కం అధ్యక్షుడు పి. సురేష్ బాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్. నాగసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి కె. బ్రహ్మానందరెడ్డి, జిల్లా నాయకులు ప్రతాప్ రెడ్డి, రవీంద్రారెడ్డి, రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


