బజారుకు వెళ్లొచ్చేసరికి చోరీ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని మార్తోమానగర్‌లో గల పునరావాస కాలనీ సమీపంలో మంగళవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని వారు బజారుకు వెళ్లొచ్చేసరికి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగులకొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు అపహరించారు. పట్టణంలోని పునరావాస కాలనీలో నివసించే దిరసంత చెన్నయ్య గత కొద్ది రోజులుగా అయ్యప్పమాల ధరించి ఉన్నా డు. బుధవారం శబరిమలకు ప్రయాణం ఉండటంతో అందుకు సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు భార్యతో కలిసి బజారుకు వెళ్లాడు. బజారు నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగులకొట్టి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గ్రహించి వెంటనే అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ సీఐ లింగప్ప, ఎస్‌ఐ జయరాము లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే క్లూస్ టీం బృందాన్ని పిలిపించి వేలిముద్రలు సేకరించారు. చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్‌ఐ జయరాములు కేసు నమోదు చేశారు. కాగా బీరువాలోని మరొక అల్మారాలో ఉన్న మరికొన్ని బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి దుండగులు వదిలేసి వెళ్లడం గమనార్హం.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అట్లూరు : మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసం హరి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వాసం హరి తన ద్విచక్రవాహనంపై సొంత పనుల మీద కొండూరు గ్రామానికి వెళ్లి తిరిగి రెడ్డిపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్నట్లుండి గేదెలు అడ్డు రావడంతో ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.
తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెద్దమండ్యం మండలం ముసలికుంట పంచాయతీ బాలచెరువుపల్లెకు చెందిన ఎం.సహదేవ కుమారుడు రాము (15) తంబళ్లపల్లె మండలం బోయపల్లెలోని మేనేత్త ఇంటిలో ఉంటూ తంబళ్లపల్లెలో ఐటీఐలో చదువుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం బోయపల్లె వద్ద నుంచి ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో గోళ్లపల్లికి సమీపంలో ముందు వరిగడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదశాత్తు కిందపడ్డాడు. అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్.ఐ ఉమామహేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరిలించారు.
బజారుకు వెళ్లొచ్చేసరికి చోరీ


