‘అద్దె’గోలు వ్యవహారం!
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కడప కేంద్ర కారాగారం ఆవరణంలో అధికారులు, సిబ్బంది కోసం దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం ‘క్వార్టర్స్’ను నిర్మించి ఇచ్చింది. వార్డర్స్, హెడ్‌వార్డర్స్ నివాసం ఉండేందుకు 30 క్వార్టర్స్, జైలర్లు, డిప్యూటీ జైలర్లు ఉండేందుకు 12 క్వార్టర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. వీటిల్లో ఎక్కువ భాగం క్వార్టర్స్ బాగా దెబ్బతిన్నాయి. నిబంధనల మేరకు క్వార్టర్స్‌లో వుంటున్న వారికి వారి వేతనాలలో హెచ్‌ఆర్‌ఏ కింద ఇచ్చే డబ్బులను ఇవ్వరు. క్వార్టర్స్‌లో కాకుండా బయట అద్దెకున్న వారికి సాధారణంగా హెచ్‌ఆర్‌ఏ కింద ఇచ్చే 20 శాతం డబ్బులను వారికి వేతనాలతో పాటు ఇస్తారు. అయితే పూర్తిగా దెబ్బతిన్న క్వార్టర్స్‌గా తీర్మానించిన తరువాత కూడా కొందరు అధికారులకు, సిబ్బందికి అందులో నివాసం ఉండేలా అవకాశం కల్పిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వార్టర్స్‌లో వుంటూనే హెచ్‌ఆర్‌ఏను పొందుతున్నవారి వివరాల్లోకి వెళితే..
కడప కేంద్ర కారాగారంలో విధులను నిర్వహిస్తున్న ముగ్గురు జైలర్లు, ప్రత్యేక మహిళాజైలు అధికారిణితో పాటు, ఓ జైలరు, ఇద్దరు కారాగార డిప్యూటీ జైలర్లు, మహిళా జైలు డిప్యూటీ జైలరుతో పాటు, 10 మంది హెడ్‌వార్డర్లు, వార్డర్లు వున్నారు. వీరు వారి వేతనంతో పాటు ఒక్కొక్కరు 15వేలు, 18 వేలు, 20 వేలు చొప్పున హెచ్‌ఆర్‌ఏను కూడా పొందుతున్నారు. ఏడాదిన్నర క్రిందటే క్వార్టర్స్ దెబ్బతిన్నాయని తీర్మానించిన వాటిల్లోనే ఎవరి అండదండలతో నివాసం ఉంటున్నారని కొందరు సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కడప కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి, డీఐజీ, ఐజీకి ఈ వ్యవహారమంతా తెలిసే జరుగుతోందా? లేక తెలిసినా తమకు ఇష్టమైన వారే కావడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కడప కేంద్ర కారాగారానికి తనిఖీకి వచ్చిన ఉన్నతాధికారులైన డీఐజీ, ఐజీ దృష్టికి వార్డర్లు ఈ వ్యవహారాన్ని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసినా తమను పట్టించుకోలేదని వారు పేర్కొంటున్నారు. ఓ అధికారికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ జైలరు ఒక్కో వార్డరు నుంచి అక్రమంగా డబ్బులను వసూలు చేసి తమకు అనుకూలంగా వున్నవారికే దెబ్బతిన్న క్వార్టర్స్‌ను ఇప్పించినట్లు బలమైన ఆరోపణలు వున్నాయి. ఏదిఏమైనా ఈ విధానం వలన ప్రతినెలా రూ.3 లక్షల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 36 లక్షల మేరకు నష్టం వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ బాగోతానికి అడ్డుకట్ట వేస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.
నివాససయోగ్యం కాని క్వార్టర్స్‌ను వినయోగించుకుంటున్న జైలు అధికారులు, సిబ్బంది
నిబంధనలకు విరుద్ధంగా ఇంటి అద్దె అలవెన్సు పొందుతున్న వైనం
ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రూ.36 లక్షలు నష్టం
ఉన్నతాధికారుల అండదండలతోనే ఇలా జరుగుతోందనే ప్రచారం
తనిఖీల పేరుతో చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్న అధికారులు
‘అద్దె’గోలు వ్యవహారం!


