ఆధ్యాత్మిక నిలయం .. జ్యోతిక్షేత్రం
● మహిమాన్వితుడు కాశినాయన
● ఈనెల 4న కాశినాయన ఆరాధన మహోత్సవాలు
● భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు
కాశినాయన : జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కాశినాయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనకు అలవాటుపడ్డారు. ఆయన గురువైన యతిరాజు గురవయ్య వద్ద ఆత్మ జ్ఞానాన్ని పొందారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ప్రవేశించి వరికుంట్ల, నాయునిపల్లె, గంగనపల్లె గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు చిన్న పిల్లలకు విద్యాబోధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనను కొనసాగించారు. ఆ సమయంలో వరికుంట్ల సమీపంలోని నల్లమల్ల కొండల్లోని జ్యోతి క్షేత్రంలోని జ్యోతి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జ్యోతి నరసింహస్వామికి పూజలు చేస్తుండేవారు. అక్కడికి సమీపంలోని గరుడాద్రి కొండ మీద కఠోర దీక్షతో తపస్సు చేశారు. అనంతరం అన్నదాన ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వచ్చేవారు.
ఆలయాల పునరుద్ధరణకు కృషి..
అవధూతగా మారిన కాశినాయన శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. చుక్కనీరు దొరకని గరుడాద్రి కొండమీద నీటిబావులు తవ్వించారు. గరుడాద్రి, అనంతరాయుడు, జ్యోతి, సిద్దేశ్వరం, లింగమయ్యకొండ, యోగానందలోని ఆలయాలను పునరుద్ధరించారు. కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో ఉన్న అహోబిలం వద్ద యోగానంద ఆశ్రమం స్థాపించి పశుసంపద, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు కుటుంబంలో పుట్టడంతో పశుపాలన, ధాన్యోత్పత్తి, ఆకలితో ఉన్న వారికి పిడికెడు అన్నం పెట్టడం అనే గుణాలు ఆయనకు అలవడ్డాయి.
జ్యోతినరసింహస్వామి పాదాల చెంత సమాధి..
వందేళ్లు జీవించిన కాశినాయన తన ఇష్టదైవమైన జ్యోతి నరసింహస్వామి పాదాల చెంత 1995 డిసెంబర్ 5వ తేదీన సమాఽధి అయ్యారు. ఆయన సమాధి చెందిన ప్రాంతంలో ఒక పురాతన మర్రిచెట్టు తనంతట తానే నేలవాలింది. ఆయన సేవిస్తూ వస్తున్న గోమాత కాశినాయన మరణాన్ని జీర్ణించుకోలేక మూడవ రోజున తనువు చాలించింది.
దేవాలయం ఏర్పాటు..
కాశినాయన సమాధిపై అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 60 తెలుగు సంవత్సరాలకు ప్రతీకగా 60 రాతిస్తంభాలతో ‘నభూతో నభవిష్యత్’ అన్నట్లుగా దేవాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆవు సమాధిని కూడా అందంగా నిర్మించారు. వంట శాలలు, భోజన శాలలు, వసతి గృహాల నిర్మాణాలతో జ్యోతిక్షేత్రం కళకళలాడుతోంది.
నిత్యాన్నదానం..
కాశినాయన ఆశ్రమాన్ని దర్శించే భక్తులకు అక్కడ స్వామి దర్శనం ఎంత ఇష్టమో ఆశ్రమంలో భోజనం చేసి రావడం అంత పవిత్రం. ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని భోజనం చేస్తుంటారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భక్తజనం లక్షల్లో వస్తుంటారు. ఏడాది పొడవునా అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. రైతులు తాము పండించిన పంటలో కాశినాయన పేరున తీసి ఉంచిన ధాన్యం, కూరగాయలు, పప్పుధాన్యాలు ఆశ్రమానికి తమకు తాముగా చేరవేస్తుంటారు. దీంతో అన్నదానం సజావుగా సాగుతుంది.
ఈనెల 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే కాశినాయన మహోత్సవాలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు చలువ పందిళ్లు, అన్నదాన కార్యక్రమం సజావుగా సాగేందుకు విస్తృతమైన భోజన కౌంటర్లు, వసతి ఏర్పాటు చేస్తున్నారు. మైదుకూరు ఆర్టీసీ డిపో వారు ఈనెల 4వ తేదీ నుండి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాశినాయన మాలను ధరించి కొంత మంది భక్తులు దీక్షలో కొనసాగుతున్నారు. వీరంతా ఈనెల 4వ తేదీ రాత్రికి జ్యోతిక్షేత్రానికి చేరుకుని జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోరుమామిళ్ల సీఐ హేమసుందర్‌రావు ఆధ్వర్యంలో కాశినాయన ఎస్‌ఐ యోగేంద్ర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


