మఠాధిపతి నియామకం జరిగేనా!
● పట్టు వీడని మారుతీ మహాలక్షుమ్మ
● అందరి సహకారంతో ముందుకు వెళుతున్నామంటున్న వెంకటాద్రి స్వామి
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి త్వరలో నూతన మఠాధిపతి నియామకం జరిగే సూచనలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నాలుగేళ్లుగా మఠాధిపతి లేకపోవడం బ్రహ్మంగారిమఠం చరిత్రలో ఇదే మొదటిసారి. మఠాల వ్యవహారం స్వయం ప్రతిపత్తిపై కొనసాగుతుంది. అలాంటిది మఠాధిపతి నియామకం విషయంలో సమస్యలు తలెత్తడంతో దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లింది. చివరికి పరిపాలనా వ్యవహారం కూడా దేవదాయ పరిధిలో ఉండిపోయింది. ఈ పరిస్థితికి ముఖ్య కారణం పూర్వపు మఠాధిపతి సరైన నిర్ణయం తీసుకోకపోవడమే అని భక్తులు ఆరోపిస్తున్నారు. మఠాల స్వయంప్రతిపత్తి నిలవాలంటే మఠాధిపతి అవసరం. అలాంటిది మఠాధిపతి లేకపోతే పరిపాలన సజావుగా సాగదనేది సత్యం. ఇక్కడ ప్రధానంగా పూర్వపు మఠాధిపతి ఇద్దరు భార్యల పిల్లల వ్యవహారం ముదరడంతో సమస్య పరిష్కారం కాలేదు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి, రెండవ కుమారుడు భద్రయ్యస్వామి, రెండవ భార్య మారుతీ మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు మధ్య పోటీ నెలకొనడంతో సమస్య ఏళ్ల తరబడి నానుతూ వస్తోంది. ప్రభుత్వం చొరవ చూపడంతో నియామకం కోసం దేవదాయ అధికారులు ధార్మిక పరిషత్ ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. ధార్మిక పరిషత్ పూర్తి వివరాలను దేవదాయ శాఖకు సమర్పించింది. మరో 10 రోజుల్లో బ్రహ్మంగారిమఠానికి నూతన మఠాధిపతిగా ఎవరిని ఎన్నుకోవాలో ఆదేశాలు వెలువడవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందరిని కలుపుకొని పోవాలనే యోచనలో వెంకటాద్రిస్వామి ఉన్నారు. అయితే పూర్వపు మఠాధిపతి రెండో భార్య మారుతీమహాలక్షుమ్మ తన కుమారుడు గోవిందస్వామిని ఎలాగైనా మఠాధిపతిని చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ధార్మిక పరిషత్ చేపట్టిన విచారణ సరిగా లేదంటూ ఆమె తన బంధువు చేత హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయించి నియామక ఉత్తర్వులకు స్టే ఇవ్వాలని కోరినట్లు వెంకటాద్రిస్వామి తెలిపారు. కానీ పిల్ వేసిన వ్యక్తి భక్తుడు కాక పోవడం, ఆమె సమీప బంధువు కావడంతో స్టే ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారని తెలిపారు. ఇప్పటికై నా అందరం కలసి ఉండాలనేది తన ప్రయత్నం అని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగించాలనుకుంటే బ్రహ్మంగారు చూసుకుంటారని చెప్పారు.


