ధర్మాసుపత్రిలో కమీషన్ల దందా!
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ప్రైవేట్ అంబులెన్సుల దందా, దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది కక్కుర్తి మూలంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో రెండు ప్రభుత్వ అంబులెన్సులు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరిన రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడి అంబులెన్సుల ద్వారా కడప రిమ్స్ లేదా కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు తీసుకెళ్తారు. అయితే అందుకయ్యే డీజిల్ ఖర్చును పేషెంట్లే భరించాల్సి ఉంటుంది. ప్రైవేట్ అంబులెన్సుల్లో కర్నూలుకు రూ. 7–8 వేలు, తిరుపతికి రూ. 8500, కడపకు అయితే రూ. 3500 వసూలు చేస్తారు. కేవలం డీజిల్‌కు అయ్యే ఖర్చే కాబట్టి ప్రైవేట్ వాహనాలకు ఇచ్చే బాడుగలో సగం ఖర్చుతో కడప, తిరుపతి, కర్నూలుకు ప్రభుత్వ అంబులెన్సుల్లో రోగులను తీసుకెళ్తున్నారు. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు జిల్లా ఆస్పత్రిలోని అంబులెన్సులను ఉపయోగించుకుంటున్నారు. ఇవి పెద్ద వాహనాలు కావడంతో పేషెంట్‌తో పాటు ఇందులో 5–6 మంది కుటుంబ సభ్యులు వెళ్లవచ్చు.
సిబ్బంది కమీషన్ల కక్కుర్తి..
జిల్లా ఆస్పత్రిలో పని చేసే కొందరు సిబ్బంది కమీషన్ల కోసం ప్రైవేట్ అంబులెన్సులకు సహకరిస్తున్నారు. యాక్సిడెంట్ కేసులు, లేదా అడ్మిషన్‌లో ఉన్న రోగులను అత్యవసరంగా రెఫర్ చేయాల్సి వచ్చినప్పుడు వీరు ప్రైవేట్ అంబులెన్స్‌లకు సమాచారం ఇస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉన్న సమయంలో ఆయా డ్రైవర్లకు సమాచారం అందించాలి. ఒక వేళ డ్రైవర్లు అందుబాటులో లేకుంటే ఫోన్లు చేసి వారిని పిలిపించాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రిలో ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉన్నా ప్రైవేట్ అంబులెన్స్‌లకు ఫోన్లు చేసి కొందరు సిబ్బంది పిలిపిస్తున్నారు. వాళ్లిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి పేదల జేబులను గుల్ల చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల కేసులు వచ్చినప్పుడు కూడా కడప రిమ్స్ లేదా కర్నూలుకు రెఫర్ చేయకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సలహా ఇస్తూ ఆయా ఆస్పత్రుల అంబులెన్స్‌లను జిల్లా ఆస్పత్రికి పిలిపిస్తున్నారు. తద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి కూడా కమీషన్లు తీసుకుంటున్నారు. ప్రైవేట్ దందాపై ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఆస్పత్రి అధికారులు ఇప్పటికై నా ప్రైవేట్ దందాపై నిఘా పెట్టాలని రోగులు కోరుతున్నారు.
ప్రైవేట్ అంబులెన్సుల్లో రోగుల తరలింపు


