కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : దేశంలో మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు, మంచి పాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మంచి నాయకత్వం అవసరమని ఏఐసీసీ కో– ఆర్డినేటర్, కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ అన్నారు. బుధవారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా జిల్లా అధ్యక్షులను, నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమించే విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు జిల్లాలో పది రోజులపాటు పర్యటిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురా లు విజయ జ్యోతి, కమిటీ సభ్యుడు, ఆర్.టి.ఐ లీగల్ సెల్ చైర్మన్ సోమశేఖర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పీర్, ధ్రువ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు, రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్‌ఖాన్, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు.


