నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి
కడప కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలని వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు నిలయంగా చంద్రబాబు సర్కార్ ఉందన్నారు. ఎమ్మెల్యేలు కూడా కడప నుంచి శ్రీకాకుళం దాకా అందిన కాడికి దోచుకుంటున్నారన్నారు. ఎవరో చేసిన వాటిని తాను చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. అధికారం మారితే మొదటి వేటు విశాఖ కార్మికులపైనే పడుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని, నేడు అదే జరుగుతోందన్నారు. 42 శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిపై ప్రైవేటు పరం చేస్తున్నా ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు. 100 మంది ప్రాణత్యాగం, వేలమంది పోరాటం వల్ల తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంటులో గతంలో 3.5 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండేదని, ప్రస్తుతం 7.4 లక్షల టన్నుల ఉత్పత్తిని కార్మికులు పెంచారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 11500 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అప్పులు తీర్చడానికే సరిపోయిందని, ఉత్పత్తి పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్మిక పక్షపాతిగా కార్మికుల వేతనాలను రూ.18వేలకు, ఆ తర్వాత రూ.22వేలకు పెంచారని గుర్తు చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను తీసేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూడటం అన్యాయమన్నారు. ఈ నల్ల చట్టాల వల్ల ఉద్యోగ భద్రత ఉండదని, సమ్మె చేసే అవకాశం ఉండదన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న 10 కేంద్ర కార్మిక సంఘాలతో వైఎస్సార్‌టీయూసీ కలిసి పోరాడుతుందన్నారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్ రాయల్, జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు
గౌతమ్‌రెడ్డి


