కమిషనర్ అండతో అక్రమాలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : సేవా కార్యక్రమాల పేరు చెప్పి నగరపాలక సంస్థకు 48 లక్షల 62 వేల 614 రూపాయలు ఎగ్గొట్టి వ్యాపార సముదాయాల నిర్మాణానికి పూనుకున్న యాదాళ్ల పిచ్చయ్య శెట్టి చారిటీస్‌పై ఫిర్యాదు చేసి, అడ్డుకొని ఆదాయాన్ని కాపాడాల్సిన కార్పొరేటర్లు టెండర్లలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టి, అనుమతి లేని నిర్మాణాలకు శ్రీకారం చుడితే టీడీపీ కార్పొరేటర్ బాలకృష్ణారెడ్డి వేలంలో పాల్గొని స్థలాన్ని దక్కించుకొని కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టడం దారుణమన్నారు. అనుమతులు లేని నిర్మాణాలు చేపడుతున్నారని కడప నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి సీపీఐ తీసుకెళ్లగా కమిషనర్ మనోజ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రమేయంతోనే జరుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంవీ సుబ్బారెడ్డి, నగర సహాయ కార్యదర్శి జి.మద్దిలేటి, నాగేశ్వరరావు, పి.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మేలు చేసిన ఘనత వైఎస్ జగన్‌దే
– వైఎస్సార్‌సీపీ జాయింట్ సెక్రటరీ ఇస్మాయిల్
కమలాపురం: రైతులకు మేలు చేసిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిదేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇస్మాయిల్ అన్నారు. కమలాపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరటి పంటలను పరిశీలించడంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. అరటి రైతుల మేలు కోసమే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పులివెందులలో 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సమగ్ర అరటి కోల్డ్ స్టోరేజ్ నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఆ కోల్డ్ స్టోరేజ్‌ని నడపలేకపోతే, దానికి జగన్‌ది బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్‌ను విమర్శించే ముందు ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కమిషనర్ అండతో అక్రమాలు


