1,20, 932 కుటుంబాలను సందర్శించాం
కడప అగ్రికల్చర్ : రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బుధవారం వరకు గ్రామస్థాయి బృందాలు 1, 20,932 కుటుంబాలను సందర్శించాయని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కమలాపురం మండలం నల్లలింగాయపల్లె రైతు భరోసా కేంద్రంలో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచ సూత్రాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు మాతృ వియోగం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తల్లి చింతకుంట రత్నమ్మ(83) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. గురువారం ఉదయం స్వగ్రామంలో చింతకుంట రత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పోట్లదుర్తికి వచ్చి ఎంపీ రమేష్ నాయుడును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వ్యక్తి అదృశ్యంపై
కేసు నమోదు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని అత్తవారి ఇంటికి వచ్చి రమణయ్య (22) అనే వ్యక్తి కనిపించకపోవడంతో అతని భార్య మునేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. వీరపునాయునిపల్లి మండలం సర్వారాజుపేటకు చెందిన రమణయ్య గొర్రెల కాపరిగా వృత్తి చేస్తున్నాడు. ఇతనికి ఎర్రగుంట్లకు చెందిన మునేశ్వరితో వివాహమైంది. ఈ నెల 22వ తేదీన అత్తవారింటికి ఎర్రగుంట్లకు వచ్చాడు. బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య మునేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కుక్క అడ్డువచ్చి..
వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనానికి కుక్క అడ్డువచ్చి ఓ ప్రైవేట్ ఉద్యోగి తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. రాయచోటి రెడ్డీస్ కాలనీకి చెందిన వెంకటరమణ కుమారుడు రెడ్డిశేఖర్(22) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఇంటికి వచ్చేందుకు బెంగళూరు నుంచి బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలోని మదనపల్లె మండలం చీకలబైలు వద్ద అకస్మాత్తుగా ద్విచక్రవాహనానికి అడ్డుగా కుక్క రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
స్థల ఆక్రమణపై ఫిర్యాదు
కలికిరి : కలికిరిలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన భూమి ఆక్రమణకు గురవుతోందని కళాశాల అధికారులు బుధవారం తహసీల్దారు హరికుమార్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాలకు కేటాయించిన సర్వే నంబరుః589/1లోని 6 ఎకరాల విస్తీర్ణం కలికిరికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించడానికి ప్రయత్నించగా అడ్డుకున్నామని వారు తెలిపారు. స్థలం ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు.


