రైతులపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం
కోల్డ్ స్టోరేజ్ వినియోగంలోకి తేవాలి..
పులివెందుల: రైతన్నలపై చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన బ్రాహ్మణపల్లె గ్రామంలోని అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అరటి రైతులు తమ దీనస్థితిని ఎంపీతో మొర పెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అరటి ధరలు పతనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేకపోవడంతోపాటు అరటి కాయలు కొనేందుకు వ్యాపారస్తులు కూడా ముందుకు రాకపోవడంతో తోటలో చెట్లపైన అరటి కాయలు మాగి కుళ్లిపోతున్నాయని వాపోయారు. ఒకవేళ వ్యాపారస్తులు కొనేందుకు వచ్చినా టన్ను అరటి కాయలను రూ.1500ల నుంచి రూ.2500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎకరా పంట అరటి సాగు చేయాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అనేక కష్టాలు పడి అప్పులు చేసి పండిస్తే పంట చేతికొచ్చే సమయానికి ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
కరోనాలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు..
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా అరటి రైతులకు ఇలాంటి విపత్కర పరిస్థితి లేదన్నారు. కరోనా సమయంలో అరటి రైతులు ఇబ్బందులు పడకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగనన్న అరటి కాయలను టన్ను రూ.4వేల ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎరువులు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులకు పంట పెట్టుబడి కూడా అధికంగా ఉందన్నారు. పంట చేతికొచ్చిన తర్వాత మద్దతు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ ప్రభుత్వంలో అరటి పంటకేకాక పత్తి, ఉల్లి, శనగలతోపాటు రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించడంలేదన్నారు.
పులివెందుల ప్రాంతంలో పండించే అరటిని దేశ, విదేశాలకు ఎగుమతి అవుతాయని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. అరటి రైతుల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పులివెందులలో రూ.25కోట్లతో కోల్డ్ స్టోరేజ్ నిర్మించామని.. ఎన్నికలముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోల్డ్ స్టోరేజ్‌ను ప్రారంభించారన్నారు. టెండర్లు పిలిచి వినియోగంలోకి తెచ్చే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి అడ్డంకిగా మారిందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 18నెలలవుతున్నా అనేకసార్లు కోల్డ్ స్టోరేజీని వినియోగంలోకి తేవాలని ప్రస్తావించినా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కోల్డ్ స్టోరేజీ వినియోగంలో ఉంటే అరటి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే కోల్డ్ స్టోరేజీని వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రసూల్, శివశంకర్‌రెడ్డి, పార్నపల్లె కిశోర్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజం
అరటి పంటల పరిశీలన


