పెట్టుబడులకు జిల్లా అనుకూలం
కడప సెవెన్‌రోడ్స్: పెట్టుబడులకు జిల్లా అన్ని విధాల అనుకూలమని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. శుక్రవారం తన చాంబర్‌లో మ్యాక్స్ వెల్ బయోసైన్సెస్ అమెరికా అనుబంధ సంస్థ హెవిహా ప్రతినిధి డాక్టర్ చేతన్ టమహంకర్‌తో ఏపీ కార్ల్ ఎంఓయూ కుదిరింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమికంగా రానున్న ఆరు మాసాలలో రూ.30 కోట్ల పెట్టుబడితో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా దాదాపు 50 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. దశల వారీగా మరో 4 సంవత్సరాలలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అపార వనరులు ఉన్నాయన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. ప్రభుత్వ పరంగా అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయానికి పులివెందుల దగ్గరగా ఉందన్నారు. ఏపీ కార్ల్ సీఈఓ ప్రొఫెసర్ శ్రీనివాసప్రసాద్, శాస్త్రవేత్త డాక్టర్ శివ ప్రసాద్, అడ్మిన్ లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


