వృద్ధురాలిని చేరదీసిన అనాథాశ్రమం
ఎర్రగుంట్ల : ఓ వృద్ధురాలిని అనాథాశ్రమం చేరదీసింది. ఎద్దుల పెద్దశేషమ్మ అనాథాశ్రమం నిర్వాహకుడు నాగేంద్ర తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యర్రగుంట్ల పట్టణంలోని వేంపల్లి రోడ్డున కరెంటు కార్యాలయ సమీపంలో అరిటికాయల భాగ్యమ్మ నివసిస్తోంది. ఆమెను కన్న కుమారుడు వదిలేశాడు. నెల నెలా వచ్చే పింఛన్ తీసుకుంటూ ఆలనా పాలనా చూసుకోకుండా ఒక వారం నుంచి బయట చలికి వదిలి వేశాడు. ఈ సమాచారాన్ని స్థానికులు తిప్పలూరులో ఉన్న ఎద్దుల పెద్దశేషమ్మ అనాథాశ్రమానికి తెలిపారు. దీంతో అనాథాశ్రమం నిర్వాహకుడు నాగేంద్ర గురువారం అక్కడికి చేరుకుని ఆమెను ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు. ఎవరైనా అనాథలు ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. సమాచారం అందిస్తే వారిని ఆశ్రమంలో చేర్చుకుని సేవలు అందిస్తామని ఆయన వివరించారు.


