ఫిర్యాదుదారుడిపైనే కేసు నమోదు
కలసపాడు : కలసపాడు పోలీసులు కొత్తపద్ధతికి శ్రీకారం చుట్టారు. తనకు అన్యాయం జరిగిందని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎగువ తంబళ్ళపల్లెకు చెందిన కళ్ళుట్లపెద్దచెంచిరెడ్డి గ్రామ పొలిమరలో నివాసముంటూ నాటుకోళ్లు పెంచుకుంటున్నారు. చెంచిరెడ్డి ఇంటికి ఎదురుగా బారెడ్డిపెద్దపోలిరెడ్డి ఇల్లు ఉంది. సమీపంలోని తన పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. పెద్దపోలిరెడ్డి పొలంలోకి చెంచిరెడ్డి కోళ్లు పోయి మొక్కజొన్న పంటను పాడుచేస్తున్నాయని గమనించి శుక్రవారం పొలం చుట్టూ బియ్యంలో విషగుళికలు కలిపి చల్లాడు. ప్రతిరోజూ మాదిరిగానే పొలం సమీపానికి వెళ్లిన కోళ్లు విషం కలిపిన గింజలు తిని పది కోళ్లు మృతిచెందాయి. వీటి విలువ రూ.15 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ విషయంపై పెద్దచెంచిరెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించి విచారించాల్సిన పోలీసులు ఏమాత్రం విచారణ చేపట్టలేదు. కాగా బారెడ్డిపెద్దపోలిరెడ్డి కుమార్తె ఐశ్వర్య ఫిర్యాదు మేరకు నాగార్జురెడ్డి, అతని తల్లి వీరమ్మపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఒత్తిడి మేరకే పోలీసులు తమపై అక్రమ కేసు నమోదు చేశారని బాధితులు వాపోయారు. ఈ విషయమై ఎస్‌ఐ తిమోతిని వివరణ కోరగా.. ఐశ్వర్యపై నాగార్జునరెడ్డి, వీరమ్మ దాడి చేయడంతోనే తాము కేసు నమోదు చేశామని తెలిపారు.


