15 మంది జూదరుల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల–కడప రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో జూదమాడుతున్న హోంగార్డు గిరినాయక్, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సుభాన్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామ సమీపంలో జూదమాడుతున్న 11మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
వైవీయూ అభివృద్ధికి సహకరించండి
కడప ఎడ్యుకేషన్ : వైవీయూ అభివృద్ధికి సహకరించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఎపిఎస్‌సిహెచ్) ఛైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిని మంగళవారం ఆయన ఛాంబర్‌లో వీసి కలిసి విన్నవించారు. విద్య, పరిశోధనాపరమైన అనుభవాలతో విద్యా సంస్థను తీర్చిదిద్దాలని, ఎపీఎస్‌సీహెచ్ పూర్తిగా వెన్నంటి ఉంటుందని ఛైర్మన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు, కె.రత్న శైలామణి, సెక్రటరి బి.తిరుపతిరావులనులాయన కలిశారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కర్నూల్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపిస్తోంది. జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు నిత్యం తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు లేకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఇన్‌ఛార్జి డీటీసీ వీర్రాజు ఆధ్వర్యంలో ఇప్ప టి వరకూ గత నాలుగు రోజుల్లో 61 కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న ఐదు బస్సులను సీజ్ చేశారు. అనుమతులు లేకపోవడం, పన్ను చెల్లించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మద్యం తాగి నడపడం, అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోవడం, సుత్తి లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం, సరిగా తెరుచుకోకపోవడం వంటి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


