రాయచోటి : అన్నమయ్య జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారి వై.సహదేవరెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని 218 కిలోమీటర్ల మేర రోడ్లను బాగు చేసేందుకు రూ. 74.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. నాబార్డు, ప్లాన్ వర్క్, నిమ్మనపల్లి–వాల్మీకిపురం – గుర్రంకొండ, కలకడ–గుర్రంకొండ, పొంతల చెరువు–తిమ్మాపురం, చిత్తూరురోడ్డు–మదనపల్లి రోడ్డు వయా కేశపురం బోనమల రహదారితోపాటు ఇతర గ్రామాల రహదారులల్లో మరమ్మతు పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
చోరీ కేసులో
నిందితుల అరెస్టు
జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని వాటర్ ట్యాంకు వీధిలోని టవర్ వద్ద ఈ నెల 21న జరిగిన బ్యాటరీ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ నరేష్‌బాబు తెలిపారు. కోవెలకుంట్ల రహదారిలో అనుమానాస్పదంగా ఉన్న పత్తూరిప్రశాంత్, పత్తూరు జగన్, అక్కలి పవన్‌సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాటరీలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుంచి బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.90 వేలు ఉంటుందని తెలిపారు. సీఐ మాట్లాడుతూ మద్యం, చెడు అలవాట్లకు వ్యసనపరులై బ్యాటరీలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో
వివాహిత మృతి
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని చౌడూరులో విద్యుత్ షాక్‌కు గురై వివాహిత సునీత (32) మృతిచెందారు. రూరల్ పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని సునీత ఇంటి పక్కనే పశువుల కోసం రేకుల షెడ్డు నిర్మించారు. షెడ్డులో ఇనుపరాడ్డుకు ఫ్యాన్‌ను అమర్చారు. ఈ క్రమంలో సర్వీసు వైర్‌కు చుట్టిన టేప్ సరిగా లేకపోవడంతో విద్యుత్ సరఫరా అయింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పశువుల పాకలోకి వెళ్లిన సునీత విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందారు. ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్ల మరమ్మతులకు రూ. 74.20 కోట్లు


