ఒంటిమిట్టలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి నూతన అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌తో కలిసి జరిగిన బోర్డు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి భక్తుల సౌకర్యం కోసం రూ. 37 కోట్లతో 100 గదులు ఉన్న నూతన ఆధునిక వసతి భవనాన్ని నిర్మించేందుకు, అలాగే రామాలయం వద్ద మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ. 2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు


