స్కానింగ్ సెంటర్ సీజ్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని సీఎన్‌ఆర్ నర్సింగ్ హోంలో ఉన్న నేహా స్కానింగ్ సెంటర్‌ను వైద్యాధికారులు సీజ్ చేశారు. లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీత మంగళవారం స్కానింగ్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలియడంతో స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసి సంబంధిత మిషన్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయానికి తీసుకెళ్లినట్లు డాక్టర్ గీత తెలిపారు. నిబంధనల ప్రకారం రిజిష్టర్ చేయించుకున్న సెంటర్‌లోనే స్కానింగ్ మిషన్ ఉంచాలని, మరోచోటికి తరలించరాదని తెలిపారు. లింగనిర్ధారణ చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, విజయకుమారి, కన్సల్టెంట్ పాలేశ్వరరావు పాల్గొన్నారు.
గ్రామాల్లో విచారణ
చింతకుంట గ్రామంలోని ఓ క్లినిక్‌లో లింగ నిర్ధారణపరీక్షలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. కొన్ని రోజుల క్రితమే ఆర్‌ఎంపీ క్లినిక్‌ను ఖాళీ చేసినట్లు గుర్తించారు. అయినా ఓ ఇంట్లో స్కానింగ్ మిషన్ పెట్టుకొని లింగనిర్ధారణ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నారు. అనుమానిత గ్రామాల్లో విచారణ చేయాలని వైద్యాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఇంతేగాక ప్రొద్దుటూరు నుంచి ఓ డాక్టర్ కూడా మొబైల్ స్కానింగ్ మిషన్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇందుక అసలు సూత్రధారులను గుర్తించే పనిలో వారు నిమగ్నమయ్యారు.


