ప్రజా సమస్యలపై కేంద్ర స్థాయిలో పోరాటం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పోరాటం చేపడతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి కడప జిల్లాకు వచ్చిన ఆయనకు నగరంలోని హరిత హోటల్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు చెప్పిన సూచనలను పాటిస్తూ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తానన్నారు. చిన్నతనం నుంచి పోరాటం అనే పదం అట్టిపెట్టుకున్నానని, గిరిజన, దళిత, పేద, బడుగు వర్గాలకు విద్యార్థులకు, కార్మిక కర్షక రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశానని తెలిపారు. చట్ట సభల్లో ప్రశ్నించే హక్కు గతంలో లెఫ్ట్ పార్టీలకు ఉండేదని, అలాంటి రోజులు రావాలనే తపనతో ముందుకు వెళతానన్నారు. కూటమి ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని మోదీ, అమిత్‌షా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యం చేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా కార్పొరేట్ సంస్థలకు సంపద దోచిపెడుతోందని వివరించారు. అమరావతిలో 64 వేల ఎకరాలు సేకరించినా.. మరో 44 వేల ఎకరాలు అవసరమంటూ పంట భూములను అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఉద్యోగులకు టీఏ, డీఏలను ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రైలులో జనరల్ కంపార్ట్‌మెంట్లు, స్లీపర్ కంపార్టుమెంట్లు పెంచాలని అడిగితే ఎయిర్‌పోర్టులు కడతాం.. విమానాలలో తిరగండి అనడం ఎన్డీఏ పాలకులకే చెల్లిందన్నారు. నక్సలైట్ల ఏరివేత ముసుగులో దమనకాండ కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పట్టుదల, అంకుఠిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగిన ఈశ్వరయ్య రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. కృషి పట్టుదల, సామాజిక స్పృహ, సమస్యలపైన పోరాటం చేసే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న దానికి నిదర్శనం గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య


