కార్తీకం... శుభకరం
ప్రతిరోజూ...
కడప సెవెన్‌రోడ్స్: పరమేశ్వరుడు, మహావిష్ణువులకు ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పూజలు, అభిషేకాలు, వ్రతాలు, అయ్యప్ప, ఇతర దేవుళ్ల మాలధారణలు.. ఇలా ఈ నెలరోజులూ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. ఈ మాసంలో ప్రతి సోమవారం ప్రధానంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. అందుకు తగినట్లుగా ఆలయాలను తీర్చిదిద్దారు.
● కడప నగరంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కార్తీక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరులోగల శ్రీ భుజంగేశ్వరస్వామి ఆలయం, అత్తిరాల పరుశురామాలయం, సిద్దవటం మండలంలోని నిత్యపూజకోన, ఒంటిమిట్టలోని ముకుంద మల్లేశ్వరస్వామి, పొలతల శ్రీ మల్లికార్జునస్వామి, కడప నగరంలోని శ్రీ మృత్యుంజయేశ్వరస్వామి, దేవునికడప శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం, అల్లాడుపల్లె, రాయచోటిలలోని వీరభద్రస్వామి ఆలయాలు, ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సజావుగా దర్శనాలు
అవసరమైన మేరకు ప్రోటోకాల్ పాటించినా దర్శనాలలో సాధారణ భక్తులకే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నామని దేవాదాయశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా ఆలయాల ఈఓలు, ఇన్‌స్పెక్టర్లను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని బట్టి వారు పోలీసు బందోబస్తును కోరవచ్చన్నారు. మండల స్థాయిలో ఈఓలు, ఇతర ఎండో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
పారిశుధ్య చర్యలు
ఆలయాల వద్ద పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నామని, భక్తులు కూడా ఈ విషయంగా తమకు సహకరించాలని దేవాదాయశాఖ అధికారులు కోరుతున్నారు. పొలతల, అల్లాడుపల్లె, నిత్యపూజకోనలోని కోనేర్లను శుభ్రం చేయాలని ఆదేశించామన్నారు. కోనేర్లలో తగిన మోతాదులో బ్లీచింగ్ కలపాలని, అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు వాచ్‌మెన్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. ఇటీవల వర్షాలకు కుంటలు, వాగులు, వంకలు నీటితో నిండి ఉన్నాయన్నారు. నదీ తీరాలు, అటవీ ప్రాంతాల ఆలయాలకు వెళ్లే సమయంలో కుంటలు, వాగుల్లో ఈతకొట్టడం మంచిది కాదని, పిల్లలు, యువకులను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండేలా పెద్దలు శ్రద్ధ చూపాలని అఽధికారులు కోరుతున్నారు.
శివకేశవులకు ఇష్టమైన మాసం
శివకేశవులిద్దరికీ ఇష్టమైనది కార్తీకమాసం. అందుకే దీన్ని దామోదర మాసంగా కూడా పిలుస్తారు. మంగళవారం సాయంత్రం నుంచే కార్తీక శుద్ధ పౌడ్యమి వచ్చింది. బుధవారం నుంచి అభిషేక సేవలు ప్రారంభమవుతాయి.
– చంద్రమౌళిశర్మ, అర్చకులు, శ్రీ సోమసుందరేశ్వరస్వామి దేవస్థానం, గడ్డిబజారు, కడప
కార్తీక మాసోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం అభిషేకాలు, అలంకారాలు, విశేష పూజలు, సర్వదర్శనం నిర్వహిస్తారు. ప్రత్యేకించి ప్రతి సోమవారం ఆలయాల్లో ప్రత్యేక పూజోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్బంగా ఉదయం లేదా మధ్యాహ్నం ఆయా ఆలయాలలో శివ కల్యాణాలు నిర్వహించి రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమాలు చేపట్టనున్నారు.
పవిత్ర మాసోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
ముస్తాబైన శైవ క్షేత్రాలు, విష్ణు ఆలయాలు
మాసమంతా కొనసాగనున్న విశేష పూజలు
నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం
కార్తీకం... శుభకరం


