
సాహితీ పరిమళాన్నందించిన ‘జానమద్ది’
కడప ఎడ్యుకేషన్: ‘తెలుగు సూర్యుడు’సి.పి.బ్రౌన్ పేరిట స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, అనేక కార్యక్రమాలు నిర్వహించి, సాహితీ పరిమళాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి అని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సోమవారం సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి 101వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా వైవీయూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనకేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనకేంద్రం సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, పరిశోధన కేంద్రం సిబ్బంది కలసి పరిశోధన కేంద్రం ప్రాంగణంలోని జానమద్ది కాంస్య విగ్రహానికి, సమావేశ మందిరంలోని చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. అనంతరం జానమద్ది సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్‌రావు, జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.