ప్రతిభాన్వేషణ!
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం వివిధ రకాల పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులలో దాగి ఉన్న నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించేందుకు భారతీయ విజ్ఞాన మండలి(బీవీఎం), ఆంధ్రప్రదేశ్ సైన్సు సిటీ, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి(ఏపీ కాస్టు) సంయుక్త ఆధ్వర్యంలో ఏటా జరిపే కౌశల్ క్విజ్ –2025 పోటీల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. పిల్లల్లో సైన్సు పరిజ్ఞానాన్ని గుర్తించడం, భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యం. విద్యార్థుల వివరాలు పంపేందుకు ఈ నెల 24 తేదీ వరకు ఆన్‌లైన్ నమోదుకు గడువు నిర్ణయించారు. ఈ ప్రతిభాన్వేషణ పోటీలలో భాగంగా విద్యార్థులకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రాం, జ్ఞాపికలను అందజేయనున్నారు.
అర్హులెవరంటే..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ కౌశల్ క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులే. సదరు విద్యార్థులు ప్రత్యేకంగా క్విజ్ టీమ్‌గా ఏర్పాటు కావాలి. తొలుత అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్సు సబ్జెక్టుల టీచర్ల ద్వారా తరగతికి ముగ్గురు విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయాలి. ఇందులో గణితం, విజ్ఞానశాస్త్రం, సాంఘీక శాస్త్రం, విజ్ఞానశాస్త్రంలో భారతీయుల కృషి అనే అంశంపై విద్యార్థులకు పోటీలు ఉంటాయి.
పోస్టర్ కాంపిటీషన్‌కు సంబంధించి..
● పోస్టర్ 1 పోటీలు 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. ఇందులో ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. వికసిత్ భారత్ కోసం సుస్థిర, హరిత ఇంధనం వనరులు సబ్జెక్టుపైన పోటీలు ఉంటాయి.
● పోస్టర్ 2 పోటీలు 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు. సత్యేంద్రనాథ్ బోస్ జీవితం, ఆయన చేసిన కృషిపై జరిగే ఈ పోటీలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి.
బహుమతులు ఇలా..
ప్రశంసాపత్రం, జ్ఞాపిక, నగదు(వ్యక్తిగతం–2 పోస్టర్లకు విడివిడిగా) ఇస్తారు.
రీల్స్, షార్ట్స్ పోటీలు..
ఆంధ్ర వైజ్ఞానిక వైభవం(సంప్రదాయ విజ్ఞానం, ప్రాచీన – ఆధునిక శాస్త్రవేత్తలు, వైజ్ఞానిక సంస్థలు) పోటీలలో 10వ తరగతి సంబంధించి ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. ఈ పోటీలకు సంబంధించిన వీడియో నిడివి రెండు నిమిషాలు ఉండాలి. ఇందులో విజేతలకు ప్రశాంసాపత్రం, జ్ఞాపిక, నగదు(నగదు వ్యక్తిగతం) ఇస్తారు.
పరీక్ష షెడ్యూల్ ఇలా..
పాఠశాల స్థాయిలో 8వ తరగతికి నవంబర్ 1వ తేదీ, 9వ తరగతికి 3వ తేదీ, 10వ తరగతికి 4వ తేదీ పరీక్ష ఉంటుంది.
జిల్లా స్థాయిలో..
జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి 8, 9 తరగతులకు నవంబర్ 27వ తేదీ, 10వ తరగతికి నవంబర్ 28వ తేదీ పరీక్షలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఈవెంట్ జిల్లా స్థాయిలో బహుమతి ప్రదాన కార్యక్రమం డిసెంబర్ 1 నుంచి 5వ తేదీలోపు నిర్వహిస్తారు.
రాష్ట్రస్థాయి ఈవెంట్..
రాష్ట్ర స్థాయి ఈవెంట్‌ను డిసెంబర్ 27వ తేదీ తిరుపతిలోని జాతీయ సాంస్కృతిక యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళన్–2025 నిర్వహిస్తారు.
సృజనాత్మకత వెలికి తీసేందుకు
కౌశల్ సైన్సు క్విజ్ పోటీలు
8, 9, 10 తరగతుల
ప్రభుత్వ విద్యార్థులకు ప్రత్యేకం
సైన్సుపై ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా అడుగులు
ఈ నెల 24వ వరకు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు తుది గడువు
విద్యార్థులను సిద్ధం చేయాలని సూచన
ప్రతిభ గల విద్యార్థులను గుర్తించాలి
గణితం, సైన్సు, సాంఘీకశాస్త్రం సబ్జెక్టులలో ప్రతిభ గల విద్యార్థులను ఉపాధ్యాయులు, పాఠశాల కో ఆర్డినేటర్లు గుర్తించాలి. ఇందులో సైన్సు క్విజ్ పోటీలకు, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలకు, వైజ్ఞానిక లఘు చిత్రం పోటీలకు 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో తరగతుల వారిగా ప్రతిభగల విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలి. ఈ పోటీల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలి.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి. వైఎస్సార్‌జిల్లా
అక్టోబర్ 24వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతూ ఆసక్తిగల విద్యార్థుల వివరాలను పాఠశాలలో కో ఆర్డినేటర్లు అక్టోబర్ 24వ తేదీలోపు www.bvmap.org ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఈ విషయంలో గణితం, సైన్సు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాలి. వివరాలకు 9440507133 నంబర్‌లో సంప్రదించాలి.
– కేవీ విజయమోహన్‌రెడ్డి, కౌశల్ జిల్లా కో ఆర్డినేటర్
ప్రతిభాన్వేషణ!
ప్రతిభాన్వేషణ!
ప్రతిభాన్వేషణ!
ప్రతిభాన్వేషణ!
ప్రతిభాన్వేషణ!


