ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
కడప కార్పొరేషన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లను అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి దానిని ప్రైవేటుకు అప్పగించేస్తున్నారని ఆరోపించారు. టూరిజంలో 42 హోటళ్లను ప్రైవేటుకు అప్పగించారని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటుకు అప్పగిస్తుంటే కమీషన్లకు కక్కుర్తి పడి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయంలో ఎన్నో ప్రతిష్టాత్మక ఫ్యాక్టరీలను ప్రైవేటుకు అప్పగించారని విమర్శించారు. ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేసేందుకు సిద్దం చేశారని, 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో సాధ్యపడలేదన్నారు. కడపలో పాతరిమ్స్‌ను కూడా అమ్మకానికి పెట్టారని గుర్తు చేశారు. తాజాగా ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారన్నారు. అలాగే ఒక ఎకరా ఏడాదికి 99పైసలకు 66 ఏళ్లకు లీజుకు ఇవ్వడం దారుణమన్నారు. కోవిడ్ కష్ట కాలంలో ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ చేతులెత్తేస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా ఎలా వైద్యం అందించారో అందరూ చూశారన్నారు. అలాంటి విపత్కర పరిస్థితి మళ్లీ తలెత్త కూడదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచి ఒక్కో జిల్లాకు ఒక్కో బోధనాసుపత్రి ఉండాలన్న సంకల్పంతో రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారన్నారు. వీటిలో ఏడు కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు జరిగాయని, మరో మూడు కాలేజీల్లో 90 శాతం పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడాదికి రూ.1000కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలు పూర్తవుతాయన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆస్తులని, వీటిని ప్రైవేటు వారికి అప్పనంగా అప్పగిస్తామంటే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. కలిసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 28వ తేది జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నామని, వీటిని ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, డా. సొహైల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, కార్పొరేటర్ షఫీ, ఫయాజ్ పాల్గొన్నారు.
ఈనెల 28న అన్నినియోజకవర్గాల్లో ర్యాలీలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి


