
టపాసులతో భద్రం!
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కోసమన్నట్లు నరక చతుర్థశి, దీపావళి పర్వదినాలు ఆది, సోమవారాల్లో వచ్చేస్తున్నాయి. మరో రెండు రోజులు ఉండగానే ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణం సందడి చేస్తోంది. దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది టపాసుల మోతనే. పల్లైలెనా పట్టణాలైనా దీపావళి నాడు టపాసుల మోతతో దద్దరిల్లాల్సిందే. అయితే బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు అగ్నిమాపక అధికారులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
● కొనుగోలు చేసిన బాణసంచాను ఎట్టి పరిస్థితులలో వంట గదిలోను, పొయ్యి ఉన్న ప్రాంతంలోనూ ఉంచకూడదు. సురక్షిత ప్రదేశంలోనే పెట్టాలి.
● టపాసులను చేతుల్లో పట్టుకుని కాల్చరాదు.
● టపాసులను వెలిగించిన తర్వాత పేలకపోతే వాటిపైకి వంగి చూడడం ప్రమాదం.
● తారాజువ్వలను సీసా బోర్లించిన రేకు డబ్బాలో పెట్టి కాల్చే పద్ధతి కూడా ప్రమాదమే.
● టపాసులు కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు కాకుండా నూలు దుస్తులు ధరించాలి.
● గాలులు విపరీతంగా ఉన్నచోట కాసేపు ఆగి టపాసులు కాల్చాలి. లేదంటే నిప్పురవ్వలు కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
● బాణసంచా కాల్చే సమయంలో దగ్గరగా నీటిని లేక ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి.
● చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో ఒంటరిగా కాకుండా తల్లిదండ్రులు పక్కన ఉండాలి.
● ఒకవేళ అనుకోని పరిస్థితులలో బాణసంచా వల్ల గాయపడితే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి. కాలిన చోట రుద్దడం వల్ల చర్మం పాడవుతుంది. ఆసుపత్రికి వెళ్లే వరకు తడి గుడ్డతో కప్పి ఉంచాలి.
● ఇంటి బయట మాత్రమే టపాసులు కాల్చాలి. ఇళ్లల్లో ప్రమాదకర వస్తువులు ఉన్నప్పుడు వాటి తీవ్రత మరింత అధికమవుతుంది.
● విపరీతమైన శబ్దాలను చెవులు భరించలేవు. చెవుల్లో దూది పెట్టుకుంటే రక్షణగా ఉంటుంది.
● అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే కళ్లకు, చెవులకు, చర్మానికి ప్రమాదం లేని పెద్ద మోత చేసే టపాసుల కన్నా తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, కాకర వొత్తులు, పెన్సిళ్లు, భుచక్రాలు వంటి వాటితో ఆనందంగా దీపావళి పండగ జరుపుకోవడం ఉత్తమం.
అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమేనంటున్న అధికారులు