
ఆర్‌ఎంపీ క్లీనిక్, ల్యాబ్ సీజ్
మైదుకూరు : ఛాతీనొప్పితో వచ్చిన మహిళకు చేసిన వైద్యం వికటించి మృతి చెందడానికి కారణమైన ఆర్‌ఎంపీ క్లినిక్, ల్యాబ్‌ను వైద్య శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మైదుకూరు పట్టణంలోని కడప రోడ్డుకు చెందిన ఓ మహిళ గురువారం మధ్యాహ్నం ఛాతీనొప్పితో బాధపడుతూ అదే రోడ్డులోని మెడికల్ షాప్ నిర్వాహకుడు వద్దకు వెళ్లారు. ఆయన చేసిన వైద్యం వికటించడంతో మహిళ మృతిచెందిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లేష్, జిల్లా డెమో ఆఫీసర్ భారతి, వైద్యాధికారులు ఎంవీఆర్ మెడికల్ స్టోర్‌ను తనిఖీ చేశారు. షాప్ నిర్వాహకుడు అనుమతులు లేకుండా ఆర్‌ఎంపీగా క్లినిక్, ల్యాబ్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ నాగరాజు ఆదేశాలతో మెడికల్ షాప్, క్లినిక్‌ను సీజ్ చేసి డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశామని డెమో అధికారి భారతి తెలిపారు. ఈ తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్ ఎస్.అయేషా, డిస్ట్రిక్ట్ లీగల్ కన్సల్టెంట్ ఎం.పాలేశ్వరరావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎం.మరియాకుమారి, ఆర్.వెంగళరెడ్డి, టి.జయప్రకాష్, కె.వీరాంజనేయులు, డి.వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎం యశోద పాల్గొన్నారు.
మహిళ మృతి కేసులో అధికారుల విచారణ