
ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం
వేంపల్లె: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడేలా ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తూ.. ప్రజల శ్రేయస్సు పట్టించుకోవడం లేదని విమర్శించారు. శుక్రవారం వేంపల్లెలోని కడప – పులివెందుల బైపాస్ రోడ్డులోని మధురెడ్డి కన్వెన్షన్ హాలులో మెడికల్ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సంతకాలు సేకరించి, ఆ ప్రతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎక్కడైనా పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వం వైద్యాన్ని దూరం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ఎంతోమందికి ప్రాణాలు పోసిన ఆరోగ్య శ్రీ పథకాన్ని దాదాపు ఎత్తేసే పరిస్థితి తెచ్చారని, వైద్య కళాశాలలను ప్రైవేట్ రంగానికి ఇచ్చేస్తున్నారన్నారు. సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన మంది మాగధులైన పెత్తందారులకు దోచి పెట్టేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనీయబోమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం సహకారంతో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల స్థాపనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 17 కళాశాలలు మంజూరు కాగా.. వీటిలో ఐదు కళాశాలలు పూర్తయ్యాయని, కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి కోటి సంతకాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించి కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర యాక్టివిటీ జనరల్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రవికుమార్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, బయపురెడ్డి, మండల కన్వీనర్లు చంద్రఓబుల్‌రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీలు గాయత్రి, మాధవి బాలకృష్ణ, చల్లా వెంకట నారాయణ, ఉపసర్పంచ్ ఆర్.శ్రీనివాసులు, రామలింగేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదు
పేదలకు విద్య, వైద్యం దూరం
అనుచరులకు దోచి పెట్టేందుకే
చంద్రబాబు పన్నాగం
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా నట్టేట ముంచిందని ఎద్దేవా చేశారు. చీనీ, అరటి, ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఒక్కో బస్సులో 150 మందిని కుక్కి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం కాలం అవుతున్నా.. అరకొరగా ఒక సిలిండర్ ఇచ్చి మహిళలను మోసం చేశారని విమర్శించారు. కల్తీ మద్యం రాష్ట్రమంతా ఏరులై పారుతోందన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. కూటమి నేతల మోసాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా పేదలకు వైద్య, విద్య దూరమవుతుందని, భవిష్యత్తులో ప్రజారోగ్యానికి భరోసా ఉండదన్నారు. వైద్యపరంగా పేదలను ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం

ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం