
ఆత్మహత్యలను ఆపి.. ప్రాణాలు నిలిపి..
● ఎర్రగుంట్ల రైల్వే పోలీసుల చొరవతో నిలిచిన రెండు నిండు ప్రాణాలు
● శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే పోలీసుల చొరవతో ఇద్దరి నిండు ప్రాణాలు నిలిచాయి. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి రాగా రైల్వే పోలీసులు గమనించి వారిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలిలా..
వేంపల్లికి చెందిన సుందరి సుమంజలి అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు వచ్చింది. రైలు పట్టాలపై పడుకొని ఉండటాన్ని ఎర్రగుంట్ల రైల్వే కానిస్టేబుళ్లు డి.వీరనారాయణ, శ్రీనివాసరావులు గమనించారు. వెంటనే రైల్వే ట్రాక్‌పై ఉన్న సుందరి సుమంజలిని కాపాడారు. తర్వాత రైల్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి వివరాలు సేకరించారు. ఆమె భర్తను పిలిపించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలతో సంతోషంగా జీవించాలని నచ్చజెప్పి ఇంటికి పంపించారు.
మద్యం మత్తులో..
ప్రొద్దుటూరుకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలో గొడవ పడి అతిగా మద్యం తాగి ఎర్రగుంట్లకు వచ్చాడు. రైలు కింద పడి చనిపోవాలని రైలు పట్టాలపై పడుకున్నాడు. అదే సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు డి. వీరనారాయణ, రామాంజనేయరెడ్డిలు వెంటనే స్పందించి పట్టాలపై ఉన్న రామాంజనేయులును కాపాడి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించారు. ఈ రెండు సంఘటనల్లోనూ రైల్వే పోలీసులు చూపిన చొరవను చూసిన వారు శభాష్ పోలీస్ అంటూ ప్రశంసించారు.

ఆత్మహత్యలను ఆపి.. ప్రాణాలు నిలిపి..